భువనగిరి కలెక్టరేట్, మే 14 : సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో అకాల వర్షాలకు వడ్లు తడిసిపోతున్నాయని యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం ఆకుతోటబావితండా గిరిజన రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. తమ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లేందుకు మంగళవారం వారు తడిసిన ధాన్యం బస్తాలతో వచ్చి కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. ఈ సందర్భంగా పలువురు గిరిజన రైతులు మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కాంటా వేయడంలో, కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. అకాల వర్షాలతో ధాన్యం పూర్తిగా తడిసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, మిల్లర్లు కుమ్మక్కై రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. ధర్నా చేస్తున్న రైతుల వద్దకు పోలీసులు రాగానే.. రైతులు వారి కాళ్లు మొక్కుతూ.. తమ బాధలు తీర్చాలని వేడుకున్నారు. విషయం తెలుసుకున్న అధికారులు రైతుల వద్దకు వచ్చి కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయడంతోపాటు, కాంటా వేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చా రు. ఈ నిరసనలో రైతులు సుధాకర్‌నాయక్, శ్రీనివాస్‌నాయక్, లక్ష్మణ్‌నాయక్, ఉమ్లానాయక్, రవీందర్, దేవేందర్, సాగర్‌నాయక్, లాలూనాయక్ తదితరులు పాల్గొన్నారు.