Bhupalpally | ప్రిన్సిపల్‌పై కోపంతో మంచినీళ్ల ట్యాంకులో పురుగుల మందు కలిపాడో టీచర్. ఆ నీళ్లు తాగిన విద్యార్థులు దవాఖాన పాలయ్యారు. భూపాలపల్లి (Bhupalpally) పట్టణంలో సుభాష్ కాలనీలో ఉన్న అర్బన్ బాలుర రెసిడెన్షియల్ పాఠశాలలో కలుశుత నీరు తాగడంతో 12 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం ఉదయం రవ్వతో చేసిన టిఫిన్‌ను తిన్న తర్వాత వారంతా వాంతులు చేసుకున్నారు. దీంతో పాఠశాల సిబ్బంది వారిని జిల్లా కేంద్రంలోని దవాఖానకు తరలించారు. ప్రిన్సిపల్ ఫిర్యాదుతో కలెక్టర్‌తోపాటు ఎస్పీ విచారణ చేపట్టారు. ఈ క్రమంలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
పాఠశాలలోని ఆర్వోప్లాంట్ కు సంబంధించిన కెమికల్స్ ద్వారా తాగునీరు ఏమైనా కలుషితమైందా అనే విషయాన్ని తెలుసుకునేందుకు డీఎంహెచ్ఓ గురుకుల విద్యాలయాన్ని సందర్శించారు. తాగునీటిని ఓ బాటిల్ లో శాంపిల్ తీసి పరీక్ష నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు. ఈ క్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ వెంకటనర్సయ్యపై కోపంతో మంచినీళ్ల ట్యాంక్‌లో ఉపాధ్యాయుడు రాజేందర్ పురుగుల మందు కలిపినట్లు గుర్తించారు. దీంతో రాజేందర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిని విచారిస్తున్నారు.