ఖైరతాబాద్, జూన్ 15: గిరిజనులను మోసంగించిన కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరు తప్పదని సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు భూక్యా సంజీవ్‌నాయక్ హెచ్చరించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ లంబాడీలను మభ్యపెట్టి ఓట్లు కొల్లగొట్టిందని ధ్వజమెత్తారు. ఇక నుంచి జాతిలో చైతన్యం నింపుతూ క్షేత్రస్థాయిలో పోరాటానికి సిద్ధమవుతామని వెల్లడించారు. మంత్రుల నియోజకవర్గాల్లో సభలు నిర్వహిస్తామని, చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపడుతామని, తమ ఉద్యమానికి సన్నాహకంగా ఈ నెల 26న సుందరయ్య విజాన కేంద్రంలో సేవాలాల్ సేన రాష్ట్ర మహాసభను నిర్వహిస్తామని వివరించారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఆయన మీడియా తో మాట్లాడుతూ.. కేసీఆర్ లంబాడీల అభివృద్ధికి పాటుడ్డారని కొనియాడారు.
రెండుసార్లు మంత్రివర్గంలో స్థానం కల్పించారని, తండాలను పంచాయతీలుగా మార్చారని, 10% రిజర్వేషన్లు పెంచారని, పోడు భూములకు పట్టాలు ఇచ్చారని, సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహించారని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ తమ జాతికి ద్రోహం చేస్తున్నా, ఆ పార్టీలో ఉన్న నలుగురు ఎమ్మెల్యేలు బానిస మనస్తత్వంతో దద్దమ్మల్లా గిరిజన జాతిని గాలికి వదిలివేశారని మండిపడ్డారు. తిరుమలలో అన్యాక్రాంతమవుతున్న హథీ రాం బాబా ఆస్తులను కాపాడాలని, ఆ ఆశ్రమ మఠాధిపతిగా బంజారా గురువును నియమించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సేవా లాల్ సేన రాష్ట్ర కన్వీనర్ మాలోతు సైదానాయక్, లకావత్ స్వరాజ్నాయక్ తదితరులు పాల్గొన్నారు.