హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): 2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు సీఎం కేసీఆర్ భూదాన్ భూముల పరిరక్షణకు చొరవ చూపారని ఆలిండియా సర్వసేవ సంఘ్ వర్కింగ్ ప్రెసిడెంట్ వెదిరె అరవింద్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం లక్డీకపూల్ సెంటర్ కోర్టు హాల్లో ఆలిండియా సర్వసేవ సంఘ్ ప్రతినిధులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే జీవో 59, 60లను రద్దు చేశారని, దీంతో భూదాన్ బోర్డు రైద్దెందని చెప్పారు. 2014కు ముందు భూదాన్ బోర్డులో చాలా అక్రమాలు జరిగాయని పేర్కొన్నారు. మాజీ చైర్మన్ వేల ఎకరాల భూములను అన్యాక్రాంతం చేశారని ఆరోపించారు. భూదాన్ భూముల విషయంలో కొన్ని రాజకీయ పార్టీల నేతలు ధర్నాలు చేస్తున్నారని, వారికి ఆ భూములతో సంబంధం ఏమిటని ఆయన ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా అన్యాక్రాంతమైన భూదాన్ భూములపై ప్రత్యేక కార్యాచరణ చేపట్టి వాటిని స్వాధీనం చేసుకొంటామని అరవింద్‌రెడ్డి తెలిపారు. త్వరలో సీఎం కేసీఆర్, డీజీపీ మహేందర్‌రెడ్డిని కలిసి అక్రమార్కులపై ఫిర్యాదు చేస్తామని వివరించారు. ఈ సమావేశంలో ఆలిండియా సర్వసేవ సంఘ్ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సుబ్బారావు, డాక్టర్ ప్రమోద్‌చంద్రారెడ్డి, భూదాన్ బోర్డు న్యాయసలహాదారు పులిమామిడి శ్రేయాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.