– మృతదేహంతో ఐటీసీ గేటు వద్ద కుటుంబ సభ్యుల ఆందోళన
బూర్గంపహాడ్, జూలై 08 : గుండెపోటుతో ఐటీసీ కార్మికుడు మృతి చెందిన సంఘటన బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాకలో బుధవారం చోటుచేసుకుంది. దీనికి సంబంధించి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సారపాక ముత్యాలమ్మపేటకు చెందిన వరికూటి నరసింహారావు (37) ఐటీసీ పీఎస్పీడీ కర్మాగారంలో మెకానికల్లో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. రోజువారీ విధుల్లో భాగంగా జనరల్ షిప్ట్నకు వెళ్లిన నర్సింహారావు లంచ్ అవర్లో పంచ్ కొట్టి బయటకు వచ్చాడు. ద్విచక్రవాహనంపై వెళుతుండగా ఛాతిలో నొప్పి వస్తుండడంతో సమీపంలోని ఆర్ఎంపీ వద్దకు వెళ్లే ప్రయత్నం చేశాడు.
అక్కడ కుప్పకూలి పోవడంతో అక్కడున్న వారు హుటాహుటిన భద్రాచలం ఆస్పత్రికి తరలించగా గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. నరసింహారావుకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు నర్సింహారావు మృతదేహంతో ఐటీసీ గేటు వద్ద ఆందోళనకు దిగారు. జనరల్ షిప్ట్నకు వెళ్లిన తన భర్త మృతికి యాజమాన్యం తగిన పరిహారం చెల్లించి తమ కుటుంబానికి న్యాయం చేయాలని ఆందోళన చేశారు. సుమారు రెండు గంటల పాటు ఆందోళన చేయడంతో యూనియన్ నాయకులు అక్కడకు చేరుకుని ఐటీసీ యాజమాన్యంతో మాట్లాడి బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.