హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ) : రైతుల భూ హక్కుల పరిరక్షణే ధ్యేయంగా భూభారతి చట్టాన్ని రూపొందించినట్టు రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అసెంబ్లీలో తెలిపారు. ఆర్వోఆర్ -24 చట్టాన్ని బుధవారం అసెంబ్లీలో మంత్రి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్వోఆర్ -2020ని పూర్తిగా ప్రక్షాళన చేసి భూభారతిని రూపొందించినట్టు చెప్పారు. ధరణి స్థానంలో భూభారతిని ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించారు. ఆగస్టు 2న ముసాయిదాను విడుదల చేసి, 40 రోజుల పాటు వెబ్సైట్లో పెట్టి సూచనలు, సలహాలు స్వీకరించినట్టు తెలిపారు. బీఆర్ఎస్ సభ్యుల నుంచి వచ్చిన సూచనలు, సలహాలను సైతం పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. భూభారతి నిర్వహణను నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెల్ (ఎన్ఐసీ)కు అప్పగించినట్టు తెలిపారు. రహస్యాలకు తావు లేకుండా సామాన్యులకు ఉపయోగపడేలా ఈ వెబ్‌సైట్‌ను రూపొందించామని స్పష్టం చేశారు.
పెగడపల్లి, డిసెంబర్ 18: రాష్ట్రవ్యాప్తంగా ధరణి పోర్టల్ మళ్లీ నిలిచింది. బుధవారం సేవలు నిలిచిపోవడంతో భూముల రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్‌ల కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ప్రభుత్వం ధరణి పోర్టల్ సవరణలో భాగంగా 12 సాయంత్రం 5 నుంచి 16వ తేదీ ఉదయం వరకు డాటా బేస్ అప్‌గ్రేడ్ ప్రక్రియను చేపట్టింది. 16వ తేదీ నుంచి సేవలు యథావిధిగా ప్రారంభం కాగా, ధరణి పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,785 మంది రైతులు స్లాట్ బుక్ చేసుకోగా, 1,402 మం ది భూములను రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.