Bhu Bharathi | కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన భూ భారతిలో లోపాలు మరోసారి బహిర్గతమయ్యాయి. తీవ్ర అనారోగ్యంతో మంచానికి పరిమితమైన ఓ భూయజమానికి తెలియకుండా ఏఐ ఫొటోలు, ఫోర్జరీ సంతకాలతో ఇతరుల పేరిట భూమిని రిజిస్టర్ చేసిన ఘటన సిద్దిపేట జిల్లాలో వెలుగులోకి వచ్చింది. బోన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న బాధితుడిని ఈ మోసం మరింత దెబ్బతీయగా.. ఆ కుటుంబం తీవ్ర ఆవేదనలో మునిగిపోయింది.
సిద్ధిపేట రూరల్ మండలం రాఘవాపూర్ గ్రామానికి చెందిన గ్యార మల్లేశ్ గత రెండేళ్లుగా బోన్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. కీమోథెరపీకి కూడా శరీరం సహకరించకపోవడంతో మంచానికే పరిమితం చేశాడు. అయితే 2023లో సిద్దిపేట జిల్లా వర్గల మండలం గౌరారంలో శ్రీమంతుల రామచంద్రం అనే వ్యక్తి నుంచి మల్లేశ్ ఎకరం భూమిని కొనుగోలు చేశాడు. అయితే ఆ భూమిని తాజాగా మల్లేశ్‌కు తెలియకుండానే వేరేవారి పేర్ల మీదకు రిజిస్టర్ చేయించారు.
మార్చి 4వ తేదీన మల్లేశ్ సంతకం లేకుండా, ఫొటో దిగకుండానే టి.అభిలాష్ అనే వ్యక్తి పేరిట అతని భూమిని భూ భారతి ఆపరేటర్ శ్రీనివాస్ రెడ్డి రిజిస్టర్ చేశాడు. అనంతరం అభిలాష్ పేరు నుంచి మార్చి 10వ తేదీన రేణుజ అనే మహిళ పేరు మీదకు మరోసారి రిజిస్టర్ చేయించాడు. అయితే క్యాన్సర్ చికిత్స కోసం మల్లేశ్ కుటుంబసభ్యులు ఈ ఎకరం భూమిని అమ్మాలని ప్రయత్నించడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది.
కాగా, ఏఐ సాయంతో సంతకాలు ఫోర్జరీ చేసి, ఫొటోలు సృష్టించి అక్రమ రిజిస్ట్రేషన్ చేసినట్లు గుర్తించారు. దీంతో బాధితుడు మల్లేశ్, అతని కుటుంబసభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన వైద్యానికి ఇప్పటికే రూ.40 లక్షల వరకు ఖర్చు అయ్యిందని.. ఆ భూమిని అమ్మకపోతే తాను బతకనని కన్నీళ్లు పెట్టుకున్నాడు. దయచేసి ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకుని సహాయం చేయాలని వేడుకున్నాడు.