హైదరాబాద్: పల్లెల్లో పొంగల్ సందడి నెలకొన్నది. మకర సంక్రాంతికి ముందు రోజు వచ్చే భోగి (Bhogi) పండుగ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. పిల్లలు, పెద్దలు ఉదయాన్నే వీధుల్లో భోగి మంటలు వేశారు. ఆడపడుచులు అందమైన ముగ్గులతో ఇంటి వాకిళ్లను అలంకరించారు. పోటీపడి మరీ రథం ముగ్గులు వేశారు. వాటిలో గొబ్బెమ్మలను పెట్టారు. పిల్లలకు రేగిపండ్లతో స్నానాలు చేయిస్తున్నారు. మరోవైపు ఉదయాన్నే భక్తులు ఆలయాలకు తరలివెళ్లి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. సంక్రాంతి కోసం హైదరాబాద్ వాసులు సొంతూళ్లకు తరలివెళ్లడంతో సందడి నెలకొన్నది. హరిదాసులతోపాటు అలంకరించిన డూడూ బసవన్నలు ఇంటింటికీ వెళ్తున్నాయి. రావమ్మా మహాలక్ష్మీ.. రావమ్మా.. అంటూ హరిదాసుల సంకీర్తనలు, పిల్లాపాపలు సల్లంగుండాలని డూడూ బసవన్నలు దీవిస్తున్నాయి.
నిజామాబాద్ జిల్లాలో భోగి పండుగ ఘనంగా మొదలైంది. రూరల్ నియోజకవర్గంలోని పలు క్యాంపుల్లో సంప్రదాయబద్ధంగా భోగి మంటలు వేశారు. భోగి మంటల చుట్టూ నృత్యాలు చేస్తూ పలు కుటుంబాలు సందడి చేశాయి. గంగిరెద్దుల విన్యాసాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. సోమవారం తెల్లవారుజామునే భోగిమంటలతో సంక్రాంతి పండుగ పర్వదినాన్ని ప్రజలు ఘనంగా స్వాగతించారు.
నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి తమ స్వాగ్రామంలో కుటుంబ సభ్యులతో కలిసి పండుగ జరుపుకుంటున్నారు. ఉదయాన్నే భోగి మంటలు వేశారు. సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి.. జిల్లా కేంద్రంలోని పలు కూడళ్లలో జరిగిన భోగి మంటల వేడుకల్లో పాల్గొన్నారు. యువత, చిన్నారులతో కలిసి భోగి మంటల కాంతుల మధ్య కోలాటం వేశారు.