జయశంకర్ భూపాలపల్లి, మార్చి 27(నమస్తే తెలంగాణ) : సింగరేణిలో మెడికల్ బోర్డు, కారుణ్య నియామకాలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. భట్టి వ్యాఖ్యలు పూర్తిగా కారుణ్య నియామకాలను ఎత్తివేసేలా ఉన్నాయని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) ఆందోళనలకు పిలుపునిచ్చింది. సింగరేణి వ్యాప్తంగా టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో శనివారం అన్ని గనులు, డిపార్ట్మెంట్లలో నాయకులు, కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి అధికారులకు వినతిపత్రాలు ఇవ్వనున్నారు. భూపాలపల్లి ఏరియాలో మహాధర్నా, రాస్తారోకో నిర్వహించనున్నారు. భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డితోపాటు నేతలు హాజరుకానున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక ముందు 13,119 మందిని కారుణ్య నియామకాల పేరుతో ఉద్యోగాల్లోకి తీసుకున్నారని, ఇందులో అవకతవకలు జరిగాయని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో పేర్కొనడంపై ఆగ్రహం వ్యక్తమవుతున్నది. విజిలెన్స్ విచారణ పేరిట బోర్డు ఏర్పాటు చేయకుండా ఆపడం వారి పనితీరుకు అద్దం పడుతున్నదని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. 2025 మార్చి నుంచి ఒక్క మెడికల్ బోర్డు కూడా నిర్వహించలేదని, నెలకు మూడు మెడికల్ బోర్డులు ఏర్పాటు చేస్తామన్న కాంగ్రెస్ హామీ ఏమైందని ప్రశ్నిస్తున్నాయి. వారసత్వ ఉద్యోగాలతో సింగరేణి కుంటుపడిందని కుంటి సాకులు చెబుతున్నారని, ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.50 వేల కోట్ల బకాయిల వల్లే సింగరేణి మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని పేర్కొంటున్నారు.
సింగరేణిలో మారుపేర్లు సరి చేయడం, విజిలెన్స్ అంశం, 2025 అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్న డిపెండెంట్లకు ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వాలని, మెడికల్ బోర్డు వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ టీబీజీకేఎస్ ఆందోళనలకు శ్రీకారం చుట్టింది. నాడు సింగరేణి సంస్థలో గోల్డెన్ హ్యాండ్ షేక్ పేరిట , డిస్మిస్ పేరున వేలాది మందిని చంద్రబాబునాయుడు ఇంటికి పంపగా.. నేడు అతడి శిష్యుడు సీఎం రేవంత్రెడ్డి అదే వైఖరి కొనసాగిస్తున్నారని మండిపడుతున్నారు. సింగరేణిలో జాతీయ సంఘాలు, నాటి పాలకులు కాలరాసిన వారసత్వపు ఉద్యోగాల హక్కును కేసీఆర్ కారుణ్యం పేరుతో పునరుద్ధరిస్తే.. నేడు బాబు శిష్యుడు మళ్లీ ఈ హక్కును పాతరపెట్టేందుకు కుట్రలు సాగిస్తున్నారని విమర్శలొస్తున్నాయి.