హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో జెన్కో ఆధ్వర్యంలో థర్మల్ విద్యుత్తు ప్లాంట్ల ఏర్పాటుకు యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విద్యుత్తు సంస్థల నూతన డైరెక్టర్లను ఆదేశించారు. విద్యుత్తు డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తికి ప్రణాళికలు సిద్ధం చేయాలని, డైరెక్టర్లకు కావాల్సినంత స్వేచ్ఛనిస్తామన్నారు. శుక్రవారం బేగంపేటలోని ప్రజాభవన్‌లో జెన్కో డైరెక్టర్లతో డిప్యూటీ సీఎం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. రామగుండం, కేటీపీఎస్ థర్మల్ ప్లాంట్ల స్థానంలో కొత్తవి నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. దావోస్, హిమాచల్, రాజస్థాన్ రాష్ర్టాలతో చేసుకున్న ఒప్పందాలపై రోజువారి సమీక్షను నిర్వహించాలని సూచించారు. గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల గృహాలపై సోలార్ పవర్ ప్యానళ్లు ఏర్పాటు చేసే ప్రణాళికలను వేగవంతం చేయాలని, ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ఇరిగేషన్, జెన్కోల సమన్వయానికి ఒక బృందాన్ని ఏర్పాటు చేయాలని తెలిపారు. ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణ భాస్కర్, జెన్కో సీఎండీ హరీష్, రెడ్కో వీసీ అండ్ ఎండీ అనీల సమీక్షలో పాల్గొన్నారు.