హైదరాబాద్: దేశాభిమానం లేనివారే ఇందిరా గాంధీపై విమర్శలు చేస్తున్నారని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ఉద్దేశ్యపూర్వకంగా దేశ తొలి మహిళా ప్రధానిని నెగెటీవ్‌గా చూపిస్తున్నారని విమర్శించారు. మాజీ ప్రధానిపై తప్పుడు ప్రచారం చేస్తూ దేశాన్ని విభజించి లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రపంచస్థాయిలో భారత్‌ను నిలబెట్టడంతో దివంగత మాజీ ప్రధాని ఇందిరా పాత్ర కీలకపాత్ర పోషించారన్నారు. దేశ సమగ్రత కోసం ప్రాణాలు విడిచారన్నారు. ఆమెపై నెగెటివ్‌గా సినిమాలు తీసే వారికి కౌంటర్ ఇచ్చారు.
దేశ సమగ్రతపై అవగాహన లేనివారు కావాలని సినిమాలు చేస్తున్నారని మండిపడ్డారు. గతం గురించి తెలియని వారు ఇందిరా చరిత్రను వక్రీకరిస్తున్నారని చెప్పారు. గతం గురించి తెలిసినవారు ఆమెకు చేతులు ఎత్తి నమస్కరిస్తారని తెలిపారు. ఇందిరమ్మ స్ఫూర్తితో మహిళలకు పథకాలు అందిస్తున్నామన్నారు. అధికారంలోకి రాగానే మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని వెల్లడించారు. బలహీన వర్గాల కోసమే సమగ్ర కుటుంబ సర్వే చేస్తున్నామని తెలిపారు. యావత్ భారత దేశం తెలంగాణ వైపు చూస్తున్నదని వెల్లడించారు. అన్ని వర్గాలకు ప్రభుత్వ పథకాలు సమానంగా అందాలనేది సర్వే ఉద్దేశమన్నారు. బీజేపీ నేతలు ఊహల్లో బతుకుతున్నారని విమర్శించారు. దేశాన్ని విభజించి రాజకీయంగా లబ్ధి పొందే కుట్రపన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ చెప్పిన ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. పేదల అకౌంట్లలో రూ.15 వేలు వేస్తామని మోసం చేశారన్నారు.