హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): సింగరేణి బొగ్గు ఉత్పాదక వ్యయంలో వ్యత్యాసం పట్ల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసంతృప్తి వ్యక్తంచేశారు. పర్మినెంట్ కార్మికులు ఓపెన్‌కాస్ట్‌లో ఉత్పత్తిచేసే బొగ్గు టన్నుకు రూ.3,500, అండర్‌గ్రౌండ్‌లో ఉత్పత్తిచేసే బొగ్గుకు రూ.9,000 అవుతున్నది. అదే ఔట్సోర్సింగ్ కార్మికులు ఓపెన్‌కాస్ట్‌లో చేసే ఉత్పత్తికి టన్నుకు రూ.1,500 మాత్రమే అవుతున్నది. దీనిపై మంత్రి స్పందిస్తూ.. ఇంత వ్యత్యాసమా? అని ప్రశ్నించారు.
ఈ వ్యత్యాసాన్ని సవరించి, ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించినప్పుడే సింగరేణికి భవిష్యత్తు ఉంటుందని అన్నారు. సింగరేణి కార్మికులకు సోమవారం లాభాల బోనస్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రజాభవన్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ దసరా సందర్భంగా ఈ నెల 11న ప్రతి గని ముందు సంస్థ నిధులతో ప్రత్యేక విందు ఏర్పాటు చేయాలని, ఆ సమయంలో ఉత్పాదకతపై కార్మికులకు అవగాహన కల్పించాలని చెప్పారు. వైద్యసేవల పరిమితిని రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతున్నట్టు ప్రకటించారు.
సింగరేణి ప్రాంతంలోని ఖాళీ స్థలాలు భవిష్యత్తులో గ్రీన్ ఎనర్జీకి ఆవాసాలుగా మారనున్నాయని, అవి సింగరేణికి ఆదాయాన్ని సమకూర్చే ఆస్తులని ఆయన అభివర్ణించారు. ప్రపంచం యావత్తు కార్బన్ ఫ్రీ వరల్డ్‌గా బొగ్గు వినియోగాన్ని తగ్గిస్తూ, థర్మల్ప్లాంట్లను మూసివేస్తూ ముందుకెళుతున్నదని అన్నారు. సింగరేణి సంస్థ బొగ్గు బావుల దగ్గరే ఆగిపోతే సంస్థ నిర్వీర్యమయ్యే ప్రమాదం ఉందని చెప్పారు. సింగరేణిని నిలబెట్టాలని గ్రీన్‌పవర్, లిథియం బ్యాటరీ రంగంలోను ప్రవేశించనున్నామని చెప్పారు.
1800 ఉద్యోగాల భర్తీ: శ్రీధర్‌బాబు
తమ ప్రభుత్వం చెన్నూరు, రామగుండంలో నైపుణ్యకేంద్రాలను ఏర్పాటు చేసిందని, 1800లకు పైగా ఉద్యోగ నియామకాలు చేపడుతున్నామని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చెప్పారు. సింగరేణిలో విద్య, వైద్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్టు రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. శ్రీరాంపూర్ డివిజన్‌ను ప్రభుత్వం అన్ని రకాలుగా విస్మరించిందని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు ఫైర్ అయ్యారు. ‘మేం బంద్పెడితే సింగరేణియే బంద్ అయితది.. గుర్తుంచుకోండి’ అంటూ హెచ్చరించారు.
మక్కాన్‌సింగ్ కినుక..
చెక్కుల పంపిణీ సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ ఠాకూర్ కినుక వహించారు. మొత్తంగా 25 మందిని చెక్కుల పంపిణీ కోసం ఎంపికచేయగా, తొలుత అత్యధిక మస్టర్లు గల కార్మికులను వేదికపైకి పిలిచారు. అయితే భట్టి విక్రమార్క, మంత్రులు ఎమ్మెల్యేలు ఒకరిద్దిరికి చెక్కులిచ్చి వెళ్లిపోయారు. దీంతో రామగుండం రీజియన్ కార్మికులకు ఆలస్యంగా చెక్కులివ్వడంతో తాను ఉన్నప్పుడు వారిని పిలవాల్సిందని అంటూ మక్కాన్‌సింగ్ ఆగ్రహం వ్యక్తంచేస్తూ వెళ్లిపోయారు.
సమస్యల ఏకరువు..
కార్మికులకు బోనస్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, గడ్డం వినోద్, గడ్డం వివేక్, డాక్టర్ మట్టా రాగమయి, గండ్ర సత్యనారాయణరావు, కోరం కనకయ్యలు సమస్యలను పరిష్కరించాలని కోరారు.
కార్మికులకు ఇండ్ల స్థలాలు, సొంతింటి పథకాన్ని రూపొందించాలని, ఖాళీగా ఉన్న క్వార్టర్లను రిటైర్డ్ కార్మికలకు నామమాత్రపు రుసుముకు కేటాయించాలని, రిటైర్డ్ ఉద్యోగులకు ఆసరా పెన్షన్ల కంటే తక్కువగా వస్తోందని, పెన్షన్ మొత్తాన్ని పెంచాలని, కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు పెంచేందుకు జీవో -22ను అమలుచేయాలని, సింగరేణి ప్రాంతంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లు నిర్మించాలని, రేషన్‌కార్డులు ఇవ్వాలని, ఆసరా పెన్షన్లు వర్తింజేయాలని ఉద్యోగావకాశాలు కల్పించాలని కోరారు.