 
                                                            హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): భారత క్రికెట్ జట్టుకు సుదీర్ఘకాలం కెప్టెన్‌గా, క్రికెట్ ఆటగాడిగా దేశానికి ఎంతో సేవ చేసిన అజారుద్దీన్ లాంటి విఖ్యాత క్రీడాకారుడికి మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తుంటే బీజేపీ అడ్డుకుంటున్నదంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పలువురు పలు ప్రశ్నలు సంధిస్తున్నారు. దేశానికి సేవ చేసిన అజారుద్దీన్ లాంటి వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు ఎందుకు ప్రాధాన్యం కల్పించలేదని ప్రశ్నిస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లు కావొస్తున్నా.. ఎమ్మెల్సీగా ఎందుకు అవకాశం ఇవ్వలేదని నిలదీస్తున్నారు. అజారుద్దీన్‌పై అంత ప్రేమ ఉంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల ప్రచారం మొదలై.. పోలింగ్ తేదీ దగ్గర పడుతున్నప్పుడే అజారుద్దీన్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి మైనారిటీల చిత్తశుద్ధి ఉంటే నోటీఫికేషన్ రాకముందే మంత్రిమండలిలోకి ఎందుకు తీసుకోలేదో చెప్పాలని నిలదీస్తున్నారు.
 
                            