మంచిర్యాలటౌన్, ఏప్రిల్ 16: మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు భూకబ్జాలు, సెటిల్మెంట్లు, పేకాట క్లబ్బులతో వచ్చిన సొమ్ము తో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర చేస్తున్నారని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు విమర్శించారు. మంచిర్యాలలో ఆదివారం మాట్లాడారు. రెండురోజుల క్రితం నస్పూర్‌లో నిర్వహించిన కాంగ్రెస్ బహిరంగసభ అట్టర్‌ఫ్లాప్ అయిందని, ప్రజలు ఆ సభనే పట్టించుకోలేదని తేల్చి చెప్పారు.
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆ సభలో ఏం మాట్లాడారో ఆయనకే తెలియదని, ఇక్క డ అభివృద్ధి లేదని ఆయన మాట్లాడటం విడ్డూరంగా ఉన్నదని మండిపడ్డారు. భట్టి, రేవంత్‌రెడ్డి వర్గాలు గ్రూపులుగా విడిపోయి గందరగోళం సృష్టించారని ఆరోపించారు. ఏండ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ హయాం లో జరిగిన అభివృద్ధి, తొమ్మిదేండ్లలో తెలంగాణలో జరిగిన అభివృద్ధిని పోల్చి చూడాలని హితవు పలికారు. పట్టుమని పది సీట్లు కూడా గెలువలేని పార్టీ అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ నేతలు పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. కమీషన్ల కోసం తాను పనిచేసినట్టు భట్టి చేసిన విమర్శలను ఎమ్మెల్యే తోసిపుచ్చారు. ప్రేమ్‌సాగర్ మాటలను నమ్మి మాట్లాడితే ఆయనకు పట్టిన గతే భట్టికి పడుతుందని హెచ్చరించారు. భట్టికి చిత్తశుద్ధి ఉంటే ప్రేమ్‌సాగర్‌రావు చేతిలో బలైన బాధితులకు న్యాయం చేయాలని సలహా ఇచ్చారు.