హైదరాబాద్ : బీఆర్ఎస్ నాయకుడు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Former Minister Niranjan Reddy ) కాంగ్రెస్ మంత్రులపై విరుచుకుపడ్డారు. ఇరిగేషన్ విషయంలో రాష్ట్ర మంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ( Minister Batti Vikramarka ) కు ఓనమాలు తెలియవని, ఆయన సమైక్యవాది అని ఆరోపించారు. తెలంగాణ భవన్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అహంకార పూరిత ధోరణితో ఉన్నారని విమర్శించారు. సమైక్య రాష్ట్రంలో పాలమూరు రెండు తరాల జీవితాలను కోల్పోయిందని వెల్లడించారు. జలయజ్ఞంలో పాలమూరు ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయని, కాంగ్రెస్ , టీడీపీ కలిసి 26 ఏళ్లలో కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్కు రూ. 2,600 కోట్లు ఖర్చు పెట్టారని తెలిపారు.భీమా,కోయిల్ సాగర్ బీఆర్ఎస్ హయాంలోనే పూర్తి అయ్యాయని వెల్లడించారు.
బీఆర్ఎస్ హయాంలో కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 4.50 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చామని వివరించారు. పాలమూరు జిల్లాలో 10 లక్షల ఎకరాలకు కేసీఆర్ నీళ్లు ఇచ్చారని, శ్రీశైలం దగ్గర సోర్స్ పెట్టి పాలమూరు,రంగారెడ్డి ప్రాజెక్టుకు కేసీఆర్ శ్రీకారం చుట్టి 27 వేల ఎకరాల భూసేకరణ పూర్తి చేశామన్నారు. ఇంకా 160 ఎకరాలు మాత్రమే భూ సేకరణ మిగిలి ఉందని తెలిపారు. ఐదు రిజర్వాయర్లు నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన,ఉద్దండాపూర్ నిర్మించామని చెప్పారు.
సీఎం రేవంత్ రెడ్డికి కళ్లు కనిపించడం లేదు
గత రెండున్నరేళ్లుగా పాలమూరు,రంగారెడ్డి పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేయలేదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి, సీఎం రేవంత్ రెడ్డికి కళ్లు కనిపించడం లేదని విమర్శించారు. డిండి ప్రాజెక్టు కోసం 40 టీఎంసీలకు పర్మిషన్ తీసుకురావాలని, కృష్ణాలో 588 టీఎంసీల నీళ్లు తెలంగాణకు కావాలని రేవంత్ రెడ్డి అందుకు డిమాండ్ చేయాలని సూచించారు. కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీళ్లను లిఫ్ట్ చేసే అవకాశం ఉందని నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. మున్సిపల్ మంత్రిగా హోం మంత్రిగా రేవంత్ ఫెయిల్ అయ్యారని తెలిపారు.
కేసీఆర్ హయంలో విద్యాశాఖలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని గుర్తు చేశారు. మహబూబ్ నగర్ జిల్లాకు గురుకులాలు , మెడికల్, ఇంజనీరింగ్ ,పాలిటెక్నిక్ కకాశాలలు కేసీఆర్ హయం లోనే అడిగినన్ని వచ్చాయని వివరించారు. మీడియా సమావేశంలో బీ ఆర్ ఎస్ నేతలు కె .కిషోర్ గౌడ్ ,అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి, గౌతమ్ ప్రసాద్ పాల్గొన్నారు.