శివ్వంపేట, డిసెంబర్ 5 : నామినేషన్ల నిర్వహణపై సంబంధిత అధికారులు మరింత శ్రద్ధ వహించాలని రాష్ట్ర ఎన్నికల అబ్జర్వర్ భారతి లక్పతి నాయక్ అన్నారు. మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలో పంచాయతీ ఎన్నికల మూడో విడత నామినేషన్ల చివరి రోజు శుక్రవారం రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు భారతి లక్పతి నాయక్ ఆకస్మికంగా పరిశీలించారు.
కౌంటర్ల వద్ద నామినేషన్ ప్రక్రియను గమనించిన ఆమె, ఎన్నికల అధికారులతో మాట్లాడుతూ ఇప్పటివరకు వచ్చిన నామినేషన్ల సంఖ్య ఎంత, అభ్యర్థులకు టోకెన్ విధానం ఎలా అమలు చేస్తున్నారని, పత్రాల పరిశీలన ఎలా జరుగుతుందో వివరంగా అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా, అభ్యర్థులు, ప్రజలకు అందిస్తున్న సౌకర్యాలపై కూడా ఆరా తీశారు. ఎన్నికల నిర్వహణలో మరింత శ్రద్ధ వహించాలని ఆమె ఆదేశించారు. ఆమె వెంట ఆర్డీవో మహిపాల్ రెడ్డి, తహసీల్దార్ కమలాద్రి, డియస్పి నరేందర్ గౌడ్, సీఐ రంగా కృష్ణ, ఎంపీడీవో వెంకట లక్ష్మమ్మ, ఎంపీఓ తిరుపతి రెడ్డి, ఎస్సై మధుకర్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.