సిటీబ్యూరో, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ సర్కారు ఎలివేటెడ్ కారిడార్ భూ బాధితుల వెంట పడుతోంది. ప్రాజెక్టుకు పరిహారం తేల్చకుండా, ప్రాజెక్టు వెడల్పును 120 ఫీట్లకు తగ్గించాలంటూ ఓవైపు కోర్టులను ఆశ్రయించి, భూములు పరిరక్షించుకంటున్నా యజమానులను నోటీసులతో భయాభ్రాంతులకు గురిచేస్తున్నది. ఇంటింటికీ నోటీసులు జారీ చేస్తూ, కోర్టు విచారణలో ఉండగా, తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు ఆస్తుల విషయంలో జోక్యం చేసుకోవద్దని ఆదేశాలు ఉన్నాయి.
జేబీఎస్ నుంచి శామీర్‌పేట మార్గంలో హెచ్ఎండీఏ నిర్మించనున్న ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ సర్కారు అమలు విధానాలు జనాలను భయపెడుతున్నాయి. భూసేకరణ నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి యజమానులు ప్రతిఘటిస్తున్న పట్టించుకోని సర్కారు.. భూములు మాత్రం సేకరించాలనే ప్రయత్నాలను విడిచిపెట్టడం లేదు. దీంతోనే నెలకోసారి బాధితులకు నోటీసులు జారీ చేస్తూ, గుర్తించిన ప్రతి ఇంటి గోడలపై అతికిస్తున్నారు. దీంతో తమ డిమాండ్లకు స్పష్టత వచ్చేంత వరకు భూములు ఇచ్చేది లేదంటూనే… కోర్టు పరిధిలో విచారణ సాగుతుండగా, నోటీసులు ఎలా జారీ చేస్తారంటూ నిలదీస్తున్నారు.
కొలిక్కి రాని పరిహారం, ప్రాజెక్టు వెడల్పు
ఏడాది కాలంగా ప్రాజెక్టు వెడల్పును 200 ఫీట్ల నుంచి 120 ఫీట్లకు తగ్గించాలనే ప్రధాన డిమాండ్‌తోపాటు, పరిహారం ప్రస్తుతం మార్కెట్ ధరలకు అనుగుణంగా ఐదు రేట్లు ఇవ్వాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. కానీ సర్కారు మాత్రం ఈ విషయాన్ని తేల్చకుండానే, బాధితుల వివరాలు, బ్యాంకింగ్ సమాచారాన్ని సేకరిస్తుంది. ఇంటింటికి అతికించిన నోటీసుల్లోనూ ఈ సమాచారాన్ని ఇవ్వాలని అధికారులు కోరుతున్నారు. అయితే టెండర్ నోటిఫికేషన్ ప్రకారం వంద అడుగుల రోడ్డు మాత్రమేనని చెప్పి… రెండు వందల అడుగల ఫీట్ల వెడల్పుతో ఎందుకు ఆస్తులు సేకరిస్తున్నారని రాజీవ్ రహదారి జేఏసీ నాయకులు తేలుకుంట సతీశ్ ప్రశ్నించారు.
కోర్టు ఆదేశాలు ఇచ్చేంత వరకు అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని, ఒకవేళ తీసుకుంటే, కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినట్లే అవుతుందన్నారు. సర్కారు విధానాలతో ఇప్పటికీ వందలాది భూ యజమానులు మానసికంగా ఆందోళన చెందుతున్నారు. ఎంతో మంది షాక్ గురై చనిపోయినవారు ఉన్నారు. కానీ సర్కారు మాత్రం ఇవేవి పట్టించుకోకుండా ఎలివేటెడ్ ప్రాజెక్టు భూసేకరణకు సిద్ధమవుతున్నది.