హైదరాబాద్ సిటీబ్యూరో, మే 9 (నమస్తే తెలంగాణ) : పాకిస్థాన్‌పై భారత్ చేస్తున్నది ధర్మయుద్ధమని, అంతా ఏకమై భారత సైన్యానికి అండగా నిలుద్దామని భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా పాకిస్థాన్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను భారత సైన్యం విజయవంతంగా ధ్వంసం చేసిందని ప్రశంసించారు. ఆపరేషన్ సిందూర్‌కు మద్దతుగా భారత సైన్యానికి సంఘీభావంగా భారత జాగృతి ఆధ్వర్యంలో ఇందిరా పార్కు నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్డు వరకు శుక్రవారం తీసిన భారీ ర్యాలీకి ఎమ్మెల్సీ కవిత నాయకత్వం వహించారు. సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తున్న క్రమంలో పాకిస్థాన్ దాడుల్లో వీరమరణం పొందిన సైనికుడు మురళీ నాయక్ చిత్రపటం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ సైన్యం వల్ల మనకు రక్షణ కలుగుతుందని, కాబట్టి వారికి ధైర్యం, స్థైర్యాన్ని నింపేందుకు ర్యాలీ తీశామని చెప్పారు. అన్ని జిల్లాల్లో ఇలాంటి ర్యాలీలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ‘ఇది ధర్మయుద్ధం. భారత్ ఎప్పడూ తప్పు చేయదు. నీతి, నిజాయితీతోనే యుద్ధం చేస్తున్నాం. మనం పాకిస్థాన్‌లోని సామాన్యులను ఏమీ అనలేదు. కేవలం ఉగ్రవాద స్థావరాలనే ధ్వంసం చేశాం’ అని చెప్పారు.
దేశంలో యుద్ధ వాతావరణం నెలకొన్న క్రమంలో రాష్ట్రంలో నిర్వహించ తలపెట్టిన మిస్ వరల్డ్ పోటీలను వాయిదా వేయాలని, ఐపీఎల్‌ను వాయిదా వేసినట్టుగా మిస్ వరల్డ్ పోటీలను కూడా వాయిదా వేయాలని ప్రభుత్వానికి కవిత విజ్ఞప్తి చేశారు. దేశంలో యుద్ధ వాతావరణం నెలకొంటే తెలంగాణలో అందాల పోటీలు పెట్టారన్న అపవాదు వస్తుందని చెప్పారు. ఇది విజ్ఞత ప్రదర్శించాల్సిన సమయమని, తప్పుడు సంకేతాలకు తావివ్వకూడదని అభిప్రాయపడ్డారు. ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ముఖ్యమంత్రికి రాష్ట్ర ఆదాయాన్ని పెంచడం చేయగాకపోతే, ఇచ్చిన హామీలను నెరవేర్చే పరిస్థితి లేకపోతే పదవి నుంచి తప్పుకోవాలని సూచించారు. పరిపాలన చేతకాని సీఎం తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులైనా, ప్రజలైనా కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని అడుగుతున్నారని, గొంతెమ్మ కోరికలేం కోరడం లేదని స్పష్టంచేశారు. ముఖ్యమంత్రి ఎప్పుడేం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని, రాష్ట్ర ప్రతిష్ఠను దిగజార్చేలా మాట్లాడటంపై ప్రజలు నవ్వుకుంటున్నారని చెప్పారు.