హైదరాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా గురువారం ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారి ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు పోటెత్తారు. భద్రాచలం, యాదాద్రి, ధర్మపురి, వేములవాడ తదితర ఆలయాల్లో తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు. భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకొన్నారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని తిరుమల శ్రీవారి రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. స్వర్ణ రథోత్సవంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని తెలంగాణకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు దర్శించుకొన్నారు. మధ్యాహ్నం నుంచి క్యూలైన్లలో ఉన్నా పట్టించుకోవడం లేదని తిరుమలలో మహాద్వారం ఎదుట భక్తులు ధర్నాకు దిగారు. తిరుమల శ్రీవారి అన్నప్రసాదం ట్రస్టుకు భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణా ఎల్లా, జేఎండీ సుచిత్రా ఎల్లా గురువారం రూ.2 కోట్ల విరాళం అందజేశారు. రంగనాయకుల మండపంలో టీటీడీ బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డిలకు డీడీని ఇచ్చారు.