Hyderabad | హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): సమీప భవిష్యత్తులో కాంగ్రెస్ నేతలను తెలంగాణ రాష్ట్ర రాజధాని పేరేమిటని అడిగితే.. హైదరాబాద్ అని కాకుండా న్యూయా ర్క్, లండన్, ఇండోర్ వంటి పేర్లు చెప్పే పరిస్థితి వస్తుందేమో? సీఎం రేవంత్‌రెడ్డి ప్రభత్వం వ్యవహారం చూస్తుంటే అలాగే కనిపిస్తున్నది. పది నెలల కాలంలో ఇప్పటికే హైదరాబాద్‌ను ఐదారు నగరాలతో పోల్చేశారు. అంటే, హైదరాబాద్ దాదాపు రెండు నెలలకు ఒక సిటీగా మారిపోతుందన్నమాట. అంతేకాదు, తెలంగాణను కూడా ‘ఫ్యూచర్ స్టేట్’ అని మార్చేసిన ఘనత సీఎం రేవంత్‌రెడ్డి సొంతం. అమెరికా పర్యటనలో భాగంగా ఆగస్టు 9న రేవంత్ మాట్లాడుతూ ‘తెలంగాణను ఇకపై ఫ్యూచర్ స్టేట్ అని పిలుద్దాం’ అని సెలవిచ్చారు.
గతంలో కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలోనూ హైదరాబాద్‌ను అంతర్జాతీయ నగరాల స్థాయిలో ‘విశ్వ నగరం’గా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. ఈ క్రమంలో లండన్, న్యూయార్క్, ఇస్తాంబుల్ వంటి నగరాల పేర్లను ప్రస్తావించారు. వాటి తరహాలోనే హైదరాబాద్, కరీంనగర్ వంటి నగరాలను మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. ఈ వ్యాఖ్యలపై నాటి ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ నేతలు దుష్ప్రచారం చేశారు. వ్యంగ్య వ్యాఖ్యానాలతో విమర్శలు చేశారు. ఇప్పుడు సీఎం రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పది నెలల్లోనే హైదరాబాద్‌ను లండన్, న్యూయార్క్, ఇండోర్, సియోల్గా మార్చేస్తామని చెప్పుకొచ్చారు. ఫిల్మ్‌సిటీ, ఫ్యూచర్ సిటీ, ఫ్యూచర్ స్టేట్ అంటూ సినిమా చూపెట్టారు. అంటే హైదరాబాద్‌ను సగటున ప్రతి రెండు నెలలకు ఒక సిటీగా మార్చేశారని విశ్లేషకులు విమర్శిస్తున్నారు.