(స్పెషల్ టాస్క్బ్యూరో), హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): గోపన్‌పల్లిలోని భాగ్యనగర్ టీఎన్జీవో భూముల్లో ప్రైవేటు వ్యక్తుల పాగాపై రెవెన్యూ శాఖ మౌనం కొనసాగిస్తున్నది. తమ రక్షణలో ఉన్న భూములు అన్యాక్రాంతమవుతున్నా వ్యూహాత్మకంగా ప్రేక్షకపాత్ర పోషిస్తున్నది. ఇదే శేరిలింగంపల్లి పరిధిలో నిరుపేదలు ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకుంటే కూల్చివేసిన రెవెన్యూ అధికారులు, ఉదయం వేళ ప్రభుత్వ భూమిలో రెండు కంటెయినర్లు వెలసినా అటువైపు కన్నెత్తి చూడటం లేదు. సుప్రీం తీర్పు ప్రకారం ప్రైవేటు వ్యక్తులకు ఎన్వోసీలు జారీ చేసినట్టు తొలుత అంగీకరించిన అధికారులు ఇప్పుడు అవి బయటికి రాకుండా తొక్కి పెడుతున్నారు. గతంలో సాక్షాత్తు జిల్లా కలెక్టర్ ఇచ్చిన నివేదికకు విరుద్ధంగా వ్యవహరించడం తమను చిక్కులో పడేస్తుందనే ఆందోళనతోనే ఎన్వోసీలు బయటికి రాకుండా జాగ్రత్త పడుతున్నట్టు తెలుస్తున్నది.
మరోవైపు 32 ఎకరాలపై ఆశ వదులుకొని మిగిలిన భూమి దక్కుతుందని ఆశించిన భాగ్యనగర్ టీఎన్జీవోలు, దానికీ ఎసరు పెడుతుండటంతో సోమవారం సైబరాబాద్ కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేయాలని భావిస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపన్‌పల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 36, 37లో ని 189.11 ఎకరాల భూములపై జిల్లా రెవెన్యూశాఖ ఇంకా దోబూచులాటలోనే ఉండిపోయింది. రికార్డులపరంగా ప్రభుత్వ భూమిగా ఉన్న దానిని పరిరక్షించాల్సిన అధికారులు ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో ప్రైవేటు వ్యక్తులకు లైన్ క్లియర్ చేసేందుకు ఇప్పటికే కొంత కసరత్తు చేశారు.
ఈ మేరకు అందులో సర్వే నంబర్ 37లోని 30 ఎకరాలకు ఎన్వోసీలు జారీ అయినట్టు స్వయానా శేరిలింగంపల్లి తహసీల్దార్ వెంకారెడ్డి కొన్నిరోజుల క్రితమే ‘నమస్తే తెలంగాణ’కు స్పష్టం చేశారు. మరో 60 ఎకరాలకు కూడా ఎన్వోసీలు రానున్నట్టు చెప్పారు. 30 ఎకరాలకు సంబంధించిన ఎన్వోసీ ప్రతులు కార్యాలయంలోనే అందుబాటులో ఉన్నాయని చెప్పిన అధికారులు ఆపై స్పందించడమే మానేశారు. ఈలోగా ప్రైవేటు వ్యక్తులు సర్వే నంబర్ 36లో కూడా పాగా వేశారు. అంటే మిగిలిన 60 ఎకరాలకు కూడా అధికారులు ఎన్వోసీ ఇచ్చారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ పైనుంచి కిందిదాకా ఈ వ్యవహారంపై ఏ ఒక్క అధికారి కూడా పెదవి విప్పడం లేదు. చివరకు సర్వే నంబర్ 36లో ప్రైవేటు వ్యక్తులు రెండు కంటెయినర్లు వేశారని సమాచారం అందినప్పటికీ కనీస చర్యలు తీసుకోవడం లేదు.
డీ నర్సింగరావు, ఇతరులు ఈ రెండు సర్వే నంబర్లల్లో 90 ఎకరాలు ఉంటే వారికి అప్పగించాలనేది సుప్రీం ఉత్తర్వుల సారాంశం. ఈ మేరకు కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే ప్రైవేటు వ్యక్తుల భూములపై సర్వే జరిగినట్టు తెలిసింది. ముఖ్యంగా భాగ్యనగర్ టీఎన్జీవోలకు చెందిన భూ ములు, వీరి భూములు ఒకటేనా? అనే అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అందుకు అనుగుణంగా అప్పటి రాజేంద్రనగర్ ఆర్డీవో ఆధ్వర్యంలో అధికారులు, సర్వేయర్లు పెద్ద ఎత్తున సర్వే చేసి ఇచ్చిన లిఖితపూర్వక వివరాలతో ప్రభుత్వానికి కలెక్టర్ నివేదిక ఇచ్చారు.
ఉద్యోగులకు చెందిన 189.11 ఎకరాల్లో ప్రైవేటు వ్యక్తులకు చెందిన 90 ఎకరాల భూమి లేదని స్పష్టంగా 2021లోనే రంగారెడ్డి కలెక్టర్ నివేదికలో ఉంది. ఈ క్రమంలో తాజాగా అధికారులు ఆ భూముల్లోనే ప్రైవేటు వ్యక్తులకు ఎన్వోసీ ఇచ్చామని చెప్పడమంటే గత కలెక్టర్ నివేదికకు విరుద్ధంగా, ప్రైవేటు వ్యక్తులకు అనుకూలంగా వ్యవహరించడమేనని రిటైర్డ్ రెవెన్యూ ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు. అప్పుడు లేదన్న భూమి ఇప్పుడెలా వస్తుంది? అని ఆయన ప్రశ్నించారు. రెండు సర్వే నంబర్లలో వేరేచోట ఇచ్చే వెసులుబాటు ఉంటుందేగానీ ఉద్యోగులకు ఇచ్చిన భూమిలో ప్రైవేటు వ్యక్తుల భూమి లేదనే నివేదిక ఉన్న తర్వాత దానిని తోసిరాజని ఎన్వోసీలు ఇవ్వడం వివాదాస్పద నిర్ణయమే అవుతుందని అభిప్రాయపడ్డారు.
ప్రైవేటు వ్యక్తుల ద్వారా 90 ఎకరాలను కైవసం చేసుకోవాలనుకున్న వ్యూహం బెడిసికొట్టడంతో ‘బిగ్’ టీం మల్లగుల్లాలు పడుతున్నట్టు తెలిసింది. ఇందులో అధికార పార్టీకి చెందిన కీలకమైన వ్యక్తులే అధికంగా ఉన్నారు. ఐదెకరాల చొప్పున గతంలోనే ఒప్పందాలు చేసుకోవడంతో తొలుత బసవతారకనగర్ గుడిసెవాసులను పంపించి సర్వే నంబర్ 37లోని 30 ఎకరాలను దక్కించుకోవాలనుకున్నారు. కానీ గుడిసెవాసులు తిరగబడటం, బీఆర్ఎస్, సీపీఐ నేతలు సంఘీభావంగా నిలవడంతో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో సర్వే నంబ ర్ 36లో పాగా వేయాలని భావించి రెండు రోజుల కిందట రెండు కంటెయినర్లను వేయించారు.
అది భాగ్యనగర్ టీఎన్జీవోలకు చెందిన భూమి అంటూ ఉద్యోగులు తెర మీదకొచ్చారు. పోలీసులకు ఫిర్యాదు వెళ్లడంతో ప్రస్తుతానికి పనులు నిలిచిపోయాయి. కానీ కంటెయినర్లు మా త్రం అక్కడే ఉండటంతో భాగ్యనగర్ టీఎన్జీవోలు సోమవారం సైబరాబాద్ పోలీసు కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేయనున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఇలా రెండువైపు లా నిప్పు రాజుకోవడంతో సదరు టీం ఎలా ముం దుకెళ్తుందనే దానిపై అధికారులతో సమాలోచనలు జరుపుతున్నట్టు తెలిసింది.