ఖమ్మం, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సత్తుపల్లి నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో వర్గపోరు భగ్గుమన్నది. ఈ నెల 17న హైదరాబాద్లో జరగనున్న కాంగ్రెస్ విజయభేరి నేపథ్యం లో సమావేశం నిర్వహించగా, ఖమ్మం లోక్సభ నియోజకవర్గ పరిశీలకుడు ఆరీఫ్ నసీమ్ఖాన్ మాట్లాడారు. ఇంతలో మట్టా దయానంద్ వర్గీయులు, పీసీసీ అధికార ప్రతినిధి మానవతారాయ్ వర్గీయుల మధ్య వర్గపోరు బయటపడింది.
తమ నేతలకు అనుకూలంగా నినాదాలు చేశారు. కుర్చీలు విసురుకోవడం, వాగ్వాదాలు, తోపులాటకు దిగారు. నియోజకవర్గంలో ఎవరి సత్తా ఏమిటో తేల్చుకుందాం అంటూ సవాళ్లు.. ప్రతిసవాళ్లు విసురుకున్నారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ కార్యకర్తలకు నచ్చజెప్పేందుకు ఎంత ప్రయత్నం చేసినా వినలేదు. సమావేశంలో మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్, మానవతారాయ్, దయానంద్ సతీమణి రాగమయి తదితరులు పాల్గొన్నారు.