మంగపేట, మే 13 : ఓ కాంగ్రెస్ నాయకుడు తమను ఉద్యోగాల నుంచి తొలగించాలని కుట్ర చేస్తున్నాడని, అదే సమయంలో అధికారులు సైతం వేధిస్తున్నారంటూ మిషన్ భగీరథలో పనిచేస్తున్న ఇద్దరు సూపర్వైజర్లు ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటన ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరు గుట్టపై బుధవారం చోటుచేసుకున్నది. బాధితుల కథనం ప్రకారం.. లొంక రాజు, ముండ్రాతి సాంబయ్య మిషన్ భగీరథ పథకంలో భాగంగా ములుగు జిల్లా మంగపేట మండలంలో సూపర్వైజర్లుగా పదేండ్లుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఒకరు తనకున్న పలుకుబడితో తమను ఉద్యోగాల నుంచి తొలగించాలని కుట్రలు చేస్తున్నాడని, కొందరు అధికారులు సైతం తమను వేధిస్తున్నారని ఆవేదన చెందారు. తీవ్ర మనస్తాపం చెందిన లొంక రాజు, సాంబయ్య బుధవారం పురుగుల మందు డబ్బాలతో మల్లూరు గుట్టపై ఉన్న ఓవర్‌హెడ్ ట్యాంక్‌పైకి చేరుకున్నారు.
సమాచారం తెలుసుకున్న ఎస్సై సూరి సిబ్బందితో అక్కడికి చేరుకొని పైఅధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని , ట్యాంక్ దిగి రావాలని కోరారు. అంతలోనే సాంబయ్య పురుగుల మందు తాగాడు. వెంటనే బాధితుడిని 108 వాహనంలో ఏటూరునాగారం దవాఖానకు, అక్కడి నుంచి ములుగు జిల్లా దవాఖానకు తరలించగా చికిత్స పొందుతున్నాడు. మరో సూపర్వైజర్ రాజు మాట్లాడుతూ.. అకారణంగా అధికారులు ఇటీవల తమను 40 రోజులపాటు విధుల నుంచి తొలగించినట్టు ఆవేదన వ్యక్తంచేశారు. సమస్యను మంత్రి సీతక్క దృష్టికి తీసుకెళ్లగా ఈ నెల 12న తిరిగి విధుల్లోకి తీసుకున్నట్టు పేర్కొన్నారు. సమస్య పరిష్కారమైందని భావిస్తున్న తరుణంలో ‘మీరు రేపటి నుంచి విధుల్లోకి రావొద్దు’ అని ఉన్నతాధికారులు అదే రోజు సాయంత్రం తెలిపారని ఆవేదన వ్యక్తంచేశారు. మంగపేట మండలానికి చెందిన ఓ కాంగ్రెస్ నాయకుడు మిషన్ భగీరథ సిబ్బందిని తన ఇంటికి పిలిచి సమావేశాలు నిర్వహిస్తూ పైఅధికారులకు తప్పుడు సమాచారం ఇస్తున్నాడని ఆరోపించారు. సదరు నాయకుడి కుట్రకు తోడు చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్న తమకు ఉద్యోగ భద్రత లేకుండాపోయిందని ఆవేదన చెందారు.