హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్తు కేంద్రాలను కాంగ్రెస్ సర్కార్ వరుసగా ప్రైవేటీకరిస్తున్నది. ఇప్పటికే యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ (వైటీపీఎస్)ను ప్రైవేటీకరించేందుకు టెండర్లు పిలువగా, కొత్తగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని భదాద్రి థర్మల్ ప్లాంట్ కూడా చేరింది. ఈ ప్లాంట్‌లోని కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్, యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించబోతున్నారు. ఈ మేరకు టీజీ జెన్కో అధికారులు సన్నాహకాలు చేస్తున్నారు. వైటీపీఎస్ ప్రైవేటీకరణ, టెండర్లకు సంబంధించిన డాక్యుమెంట్లను బీటీపీఎస్ అధికారులు తీసుకున్నట్టు సమాచారం. కోల్‌హ్యాడ్లింగ్, యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్ల టెండర్ల వివరాలను సేకరించినట్టు జెన్కో వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతున్నది.
తెలంగాణ ఏర్పడిన తొలినాళ్లల్లో విద్యుత్తు కటకట అన్నట్టుగా పరిస్థితులుండేవి. విద్యుత్తు కొరతను అధిగమిచేందుకు కేసీఆర్ సర్కార్ మణుగూరులో ఈ ప్లాంట్‌ను నెలకొల్పింది. ఇందులో 270 మెగావాట్ల సామర్థ్యం గల నాలుగు యూనిట్లు ఉన్నాయి. 1,080 మెగావాట్ల ఈ ప్లాంట్‌ను సర్కార్ రికార్డు స్థాయిలో తక్కువ రోజుల్లోనే నిర్మించింది. 2020 జూన్‌లో లో మొదటి, జూలైలో రెండో, 2021 మార్చిలో మూడో, 2022 జనవరిలో నాలుగో యూనిట్ కమర్షియల్ ఆపరేషన్స్ ప్రారంభమయ్యాయి.
2025 -26లో ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్ఎఫ్) 67. 53 శాతం కాగా, 2026 -27లో పీఎల్ఎఫ్ 73.52శాతంగా నమోదయ్యింది. ఈ ప్లాంట్‌లోని 400 వరకు పనుల కాంట్రాక్ట్‌లను వివిధ సంస్థలకు ఔట్‌సోర్సింగ్‌కు అప్పగించారు. అయితే ఇప్పుడు మొత్తం కోల్‌హ్యాండ్లింగ్, యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్లను పూర్తిగా ప్రైవేట్‌కు అప్పగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ చర్యలను తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ నేతలు ఖండిస్తున్నారు. తక్షణమే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని రాష్ట్ర సర్కార్‌ను డిమాండ్ చేస్తున్నారు.
