Bhadrachalam | భద్రాచలం, ఏప్రిల్ 5: భద్రాచల క్షేత్రంలో ఆదివారం జరుగనున్న మహాఘట్టానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. భద్రాచలంలో ఆదివారం రాములోరు సీతమ్మను పరిణయమాడే ఘట్టాన్ని వీక్షించేందుకు తెలుగు రాష్ర్టాలతోపాటు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు తరలి వచ్చారు. కల్యాణం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దంపతులు సమర్పించనున్నారు. జగత్కల్యాణాన్ని తిలకించేందుకు మంత్రులు, హైకోర్టు న్యాయమూర్తులు హాజరుకానున్నారు. శ్రీరామనవమి సందర్భంగా రామాలయాన్ని విద్యుద్దీపాలతో సుందరీకరించారు.
మిథిలా స్టేడియంలో శిల్పకళా శోభితమైన కల్యాణ మండపాన్ని అద్భుతంగా అలంకరించారు. స్టేడియంలో 100 టన్నుల ఏసీతోపాటు, వంద కూలర్లు, 250 ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. ఉదయం 10:30 గంటలకు తిరు కల్యాణ మహోత్సవం ప్రారంభమవుతుంది. కల్యాణ వేడుకలో భాగంగా శనివారం రాత్రి ఎదుర్కోలు ఉత్సవం సంప్రదాయబద్ధంగా సాగింది. గరుత్మంతుడి వాహనంపై స్వామివారిని మిథిలా స్టేడియం ఎదురుగా ఉన్న వైకుంఠద్వారం వద్దకు తీసుకువచ్చి కొలువుదీర్చారు. శ్రీసీతారాముల వైభవాన్ని లోకానికి తెలియచెప్పేందుకే ఎదుర్కోలు వేడుక నిర్వహిస్తున్నట్టు పండితులు ఉపదేశించారు.
అనంతరం ఊరేగింపుగా స్వామి, అమ్మవార్లను ఆలయానికి తీసుకువెళ్లారు. కల్యాణ మహోత్సవానికి వచ్చే భక్తుల కోసం మూడు లక్షల లడ్డూలను దేవస్థానం అధికారులు సిద్ధం చేశారు. మిథిలా స్టేడియంలో సోమవారం శ్రీరామ మహాపట్టాభిషేకాన్ని నిర్వహించనున్నారు. పట్టాభిషేకాన్ని తిలకించేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరై పట్టువస్ర్తాలు సమర్పించనున్నారు. ఏర్పాట్లపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఎస్పీ రోహిత్‌రాజు ఆధ్వర్యంలో 1,800 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఆలయ ఈవో రమాదేవి, అధికారులు, వేదపండితులు పాల్గొన్నారు.