Bhadrachalam | న్యూస్ నెట్వర్క్: ఎడతెరిపిలేకుండా బుధవారం కురిసిన వర్షానికి భద్రాచలం మునిగింది. రామాలయ పరిసరాలు, అన్నదాన సత్రంలోకి వరద వచ్చిచేరింది. ఆలయ కొండపై ఉన్న కుసుమ హరినాథబాబా ఆలయ కల్యాణమండపం కుంగిపోయింది. భద్రాద్రి జిల్లా గరిమల్లపాడులో అత్యధికంగా 75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కిన్నెరసాని, తాలిపేరు జలాశయాల్లోకి భారీగా వరదనీరు చేరడంతో అధికారులు ప్రాజెక్టుల గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. మహబూబాబాద్‌లోని ఉత్తరతండా పంచాయతీ నేతాజీ తండా పాఠశాల గదుల్లోకి వరద చేరింది. డోర్నకల్ శివారు మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. వరంగల్ జిల్లా ఖానాపురం లోని పాకాల సరస్సు నీటిమట్టం బుధవారం సాయంత్రానికి 29.9 అడుగులకు చేరుకుంది.
మూడు రోజులు భారీ వర్షాలు
రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. ఉత్తర, దక్షిణ ద్రోణి రాయలసీమ నుంచి అంతర్గత తమిళనాడు మీదుగా కోమరిన్ ప్రాంతం వరకు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో కొనసాగుతున్నదని, దీని ప్రభావంతో తెలంగాణ వైపు గా లులు వీస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడన ప్రభావంతో పలు జిల్లాల్లో రాబోయే మూడు రోజులు భారీ వర్షాలు కు రిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. హైదరాబాద్‌లో వాతావరణం పొడిగా ఉంటుందని చెప్పారు. 24 గంటల్లో రాష్ట్రంలోని జోగులాంబ గద్వా ల, భదాద్రి కొత్తగూడెం, మహబూబ్‌నగర్, ములుగు, నారాయణపేట, వనపర్తి జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి.
కాళేశ్వరం జలాల ఎత్తిపోత
కాళేశ్వరం లింక్-2లో గోదావరి జలాలు పరవళ్లు తొక్కుతున్నాయి. పదకొండు రోజులుగా ఎల్లంపల్లి నుంచి మధ్యమానేరుకు పరిగెత్తుతున్న జలాలు, బుధవారం నుంచి సిద్దిపేట జిల్లాలోని రంగనాయనాయక సాగర్‌కు పరుగులు తీస్తున్నాయి. దిగువన కాళేశ్వరం ప్రాజెక్ట్ లింక్-2లోని నంది, గాయత్రీ పంప్‌హౌస్‌లో ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి.