హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): అభం శుభం తెలియని యువతకు డబ్బులు ఆశచూపి.. బెట్టింగ్ దందాలోకి లాగుతున్న ముఠాలు.. వారి జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. ఆన్లైన్లో యాప్స్ అరచేతిలో అందుబాటులో ఉండటం, ప్రకటనలు ఆకర్షించడం, అడ్డుకోవాల్సిన ప్రభుత్వం అలసత్వం వహించడం.. వెరసి యువత బంగారు భవిత బెట్టింగ్ భూతానికి బలవుతున్నది. తెలంగాణలో దాదాపు ఊరూరా ఆన్లైన్ బెట్టింగ్ నడుస్తున్నదని తెలుస్తున్నది. పేద, మధ్యతరగతి తేడాలేకుండా యువకులు బెట్టింగ్ ఊబిలో చిక్కుకుపోతున్నారు. డబ్బులు లేకపోయినా ఆన్లైన్ లోన్‌యాప్‌ల ద్వారా అప్పులు తీసుకుంటూ, వారిటి తీర్చే మార్గం దొరకక, వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. ప్రహార్ (పబ్లిక్ రెస్పాన్స్ అగెనెస్ట్ హెల్ప్లెస్నెస్ అండ్ యాక్షన్ ఫర్ రీడ్రెస్సల్) అనే ఢిల్లీకి చెందిన స్వచ్ఛంద సంస్థ సర్వేలో ఇలాంటి కీలక విషయాలు బయటపడ్డాయి.
ఈజీ మనీ కోసం బెట్టింగ్
రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వారాలపాటు ప్రహార్ సంస్థ 2,761 మంది యువకులతో సర్వే నిర్వహించింది. ఎక్కువ మంది ‘సులభంగా డబ్బు సంపాదించాలి’ అనే కారణంతోనే బెట్టింగ్‌కు పాల్పడుతున్నట్టు తేల్చింది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందవచ్చన్న ఆశతో డబ్బులు పెట్టిన వారిలో 86 శాతం మంది తీవ్రంగా నష్టపోయినట్టు గుర్తించింది. ఎక్కడో ఎవరికో డబ్బులు వస్తే.. వారిని సోషల్‌మీడియాలో చూసి, ఇన్ఫ్లూయెన్సర్లు చెప్తే నమ్మి, లక్షలాది మంది యువత తీవ్రంగా నష్టపోతున్నారని వెల్లడించింది. ‘ఇతరులు గెలుస్తున్నారని నమ్మడం వల్లే.. మేం కూడా బెట్టింగ్‌కు దిగాం’ అని సర్వేలో 56 శాతం మంది తెలిపారు.
బెట్టింగ్ యాప్స్ అడ్డాగా టెలిగ్రామ్
ఆన్లైన్ బెట్టింగ్‌యాప్‌లకు టెలిగ్రామ్ అడ్డాగా మారింది. ఎక్కువమంది యువత టెలిగ్రామ్ నుంచే యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటున్నారు. వాటిల్లో ఎక్కువగా ఏపీకే ఫైల్స్ ఉన్నట్టు ప్రహార్ సర్వే తెలిపింది. వీపీఎన్ల సాయంతో తమ ఐడెంటిటీని గోప్యంగా ఉంచుతూ, టెలిగ్రామ్ ద్వారా బెట్టింగ్‌కు పాల్పడుతున్నట్టు 69% మంది ఒప్పుకున్నారు. ప్లేస్టోర్ యాప్‌లను 20% మంది ఉపయోగిస్తున్నట్టు సర్వేలో తేలింది. ఇది చట్టవ్యతిరేకమని తెలిసి కూడా బెట్టింగ్‌కు పాల్పడినట్టు 96% మంది చెప్పారని ప్రహార్ ప్రకటించింది.
బెట్టింగ్ దందాపై నియంత్రణ కరువు
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం బెట్టింగ్ భూతంపై ఉక్కుపాదం మోపింది. 2017లోనే తెలంగాణ గేమింగ్ యాక్ట్‌కు సవరణలు చేసింది. దేశంలో అన్ని రకాల ఆన్లైన్ రియల్ మనీ గేమ్స్‌పై నిషేధం విధించిన తొలి రాష్ట్రంగా నిలిచింది. బెట్టింగ్‌కు పాల్పడిన వారికి జైలుశిక్ష, జరిమానా విధించేలా నిబంధనలు రూపొందించింది. కానీ ప్రస్తుతం తెలంగాణలో వేలాదిగా గేమింగ్ యాప్‌లు వచ్చిపడుతున్నా కట్టడి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమవుతున్నదని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు విమర్శిస్తున్నారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ద్వారా యాప్‌లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.