హైదరాబాద్ : తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్య ప్రమాణాలు పెరిగాయని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కేపీహెచ్‌బీ కాలనీ 3వఫేజ్‌లో ఎన్టీఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల నిర్మాణ పనులకు శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కేజీ టూ పీజీ వరకు ఉచితంగా చదువులను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పాఠశాలలను అభివృద్ధి చేయడం, మోడల్ పాఠశాలలను నిర్మించారని వెల్లడించారు.
‘మనఊరు-మనబడి’ కార్యక్రమంతో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలన్నింటిలో మెరుగైన వసతులు కల్పించే దిశగా పనులు సాగుతున్నాయన్నారు. కష్టపడి చదివే పేద విద్యార్థుల కోసం అన్ని రకాలుగా అండగా ఉంటుందని పేర్కొన్నారు. విద్యార్థులకు బంగారు భవిష్యత్‌ను అందించడమే లక్ష్యంగా ఎన్టీఆర్ పేరుతో ఉన్నత పాఠశాలను నిర్మిస్తున్నామని అన్నారు.
కాలనీలో ఎన్టీఆర్ పేరుతో ఉన్నత పాఠశాలను నిర్మించేందుకు కోటి రూపాయల విరాళాన్ని అందజేసిన కేపీహెచ్‌బీ కాలనీ కార్పొరేటర్ మందడి శ్రీనివాస్‌రావుకు అభినందనలు తెలిపారు. మేడ్చల్ జిల్లా కలెక్టర్ హరీశ్, ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, ఎమ్మెల్సీ కుర్మయ్యగారి నవీన్‌కుమార్, కేపీహెచ్‌బీ కాలనీ కార్పొరేటర్ మందడి శ్రీనివాస్‌రావు తదితరులు పాల్గొన్నారు.