Indiramma Indlu | హైదరాబాద్, నవంబర్ 15(నమస్తే తెలంగాణ): ‘దీపావళికి ఇండ్లకు ముగ్గులు పోస్తాం.. పేదలకు దీపావళి కానుక ఇస్తాం.. ఈ నెల 5, 6 తేదీల నుంచి దరఖాస్తులను స్వీకరించి గ్రామసభల్లో లబ్ధిదారులను ఎంపికచేస్తాం..’ ఇవీ ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వివిధ సందర్భాల్లో చెప్పిన మాటలు. ప్రభుత్వం ఏర్పడి 11 నెలలు కావస్తున్నా.. దీపావళి పండుగై పదిరోజులు గడుస్తున్నా ఇంతవరకు ఇందిరమ్మ ఇండ్ల వ్యవహారం ఓ కొలిక్కి రాలేదు. గ్రామ కమిటీల ఏర్పాటు రాజకీయ జోక్యంతో ముందుకు సాగకపోగా, లక్షలాది దరఖాస్తులు రావడంతో లబ్ధిదారుల ఎంపిక అధికారులకు తలకుమించిన భారంగా మారింది.
ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా పేదల ఇంటి నిర్మాణానికి రూ.5లక్షల చొప్పున ఇస్తామని ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల్లో ప్రకటించింది. ప్రభుత్వం ఏర్పాటై 11 నెలలు కావస్తున్నా ఇంతవరకు ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదు. కనీసం దీనికి సంబంధించిన ప్రక్రియ ఓ కొలిక్కిరాలేదు. ప్రజాపాలన దరఖాస్తుల సందర్భంగా రాష్ట్రంలో దాదాపు 82వేల పైచిలుకు మంది ఇల్లు మంజూరీకి దరఖాస్తు చేసుకున్నారు. మొదటి ఏడాది నాలుగున్నర లక్షల ఇళ్లను మాత్రమే మంజూరు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం, కనీసం ఇందుకు అవసరమైన నిధులను కూడా పూర్తిగా బడ్జెట్లో కేటాయించలేదు. సుమారు రూ. 22,000 కోట్ల పైచిలుకు నిధులు అవసరం కాగా, బడ్జెట్లో మాత్రం రూ. 7,740 కోట్లు మాత్రమే కేటాయించడం విశేషం. వచ్చే నాలుగేండ్లలో మరో 20లక్షల ఇళ్లు నిర్మిస్తామని మంత్రి ఇటీవల విలేకరుల సమావేశంలో ప్రకటించారు. ఇంతవరకు మొదటి విడత నాలుగున్నర లక్షల మంది లబ్ధిదారుల ఎంపికే పూర్తికాలేదు. గ్రామసభల్లో లబ్ధిదారులను ఎంపికచేస్తామని మొదలు ప్రకటించిన ప్రభుత్వం.. ఆ తరువాత లబ్ధిదారుల ఎంపికకు గ్రామ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. ఆయా వర్గాల నుంచి సభ్యులను నియమించాల్సి ఉండగా, ఇవి పూర్తిగా రాజకీయ పార్టీ కమిటీలుగా మారిపోయాయనే విమర్శలు గుప్పుమన్నాయి. అధికారపార్టీకి అనుబంధంగా ఉన్నవారికే కమిటీల్లో చోటు కల్పిస్తున్నట్టు పెద్దఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ రాజకీయ కమిటీల ద్వారా లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా సాగే అవకాశం లేదని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది.
కేంద్రం నిధులు ఇచ్చినా, ఇవ్వకపోయినా తాము ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి తీరుతామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇటీవల ప్రకటించారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాత్రం గతంలో అధికారులతో నిర్వహించిన సమీక్ష సందర్భంగా కేంద్రం నుంచి సాధ్యమైనంత ఎక్కువ ఇండ్లు రాష్ర్టానికి మంజూరు చేయించేందుకు కృషిచేయాలని ఆదేశించారు. ఒక్కో ఇంటికి కేంద్రం 1.20 లక్షలు మాత్రమే మంజూరు చేస్తుంది. అందులో రాష్ట్ర వాటా ప్రకారం మూడున్నర లక్షలకుపైగా కలుపుకొని లబ్ధిదారులకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఏడాది ఇండ్ల కోసం ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించింది రూ. 7,740కోట్లు మాత్రమే. అవసరమైన నిధుల్లో కేటాయించింది మూడింట ఒక వంతు మాత్రమే. మిగిలిన రెండింతల నిధులు ప్రభుత్వం ఎక్కడినుంచి ఇస్తుందో స్పష్టతలేదు. మంత్రి మాత్రం కేంద్రం ఇచ్చినా ఇవ్వకున్నా ఇండ్లు నిర్మించి తీరుతామని ప్రకటిస్తున్నారు. మార్చి నెలలో ఇండ్ల పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వం ఏడు నెలలు పూర్తయి, ఎనిమిదో నెల నడుస్తున్నా ఇంతవరకు ఒక్క అడుగు కూడా ముందుకు వేయకపోవడాన్నిబట్టి ఇండ్ల నిర్మాణంలో ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు.
గృహ నిర్మాణ పథకానికి సంబంధించి ఇతర రాష్ర్టాలు కేంద్ర నిధులను ఎలా వాడుకుంటున్నాయో అధ్యయనం చేసేందుకు ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర తదితర రాష్ర్టాల్లో మన రాష్ట్ర అధికారులు అధ్యయనం నిర్వహించారు. ఏపీ, ఉత్తరప్రదేశ్, తమిళనాడు తదితర రాష్ర్టాల్లో పీఎం ఆవాస్ యోజన నిబంధనల ప్రకారమే లబ్ధిదారుల ఎంపిక జరుగుతుండగా, కర్నాటక, మహారాష్ట్రలో మాత్రం పీఎం ఆవాస్ యోజనను అమలు చేస్తూనే దానికి సమాంతరంగా రాష్ట్ర ప్రభుత్వాలు సొంతంగా మరో గృహ నిర్మాణ పథకాన్ని అమలు చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. నిధులు మాత్రం పీఎం ఆవాస్ యోజన పథకం మాదిరిగానే మంజూరు చేస్తున్నారు. పీఎం ఆవాస్ యోజన పథకం కింద లబ్ధిదారుల ఎంపిక కేంద్రం చేపడుతుండగా, రాష్ట్ర గృహనిర్మాణ పథకం లబ్ధిదారుల ఎంపిక రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్నాయి. రెండు పథకాలకూ నిధులు ఒకేలా ఉండడంతో ఆ రాష్ర్టాలపై పెద్దగా ఆర్థిక భారం పడడంలేదు. మన రాష్ట్రంలో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఒక్కో ఇంటికి రూ.5లక్షల చొప్పున ఇవ్వనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో లబ్ధిదారుల ఎంపిక ఎలా ఉన్నా కేంద్రం ఇచ్చే నిధులకు రాష్ట్రం తమ వాటా కలుపకతప్పదు.