చేర్యాల, ఏప్రిల్ 15: గ్రామాల్లో వారం రోజుల్లోగా బెల్ట్‌షాపులు మూసేయకపోతే మహిళలతో కలిసి మద్యం సీసాలు పగులగొడతామని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి హెచ్చరించారు. బుధవారం ఆయన సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం పోతిరెడ్డిపల్లిని సందర్శించారు. గ్రామంలో కొనసాగుతున్న బెల్ట్‌షాపులతో కుటుంబాలు ఆగమవుతున్నాయని పలువురు మహిళలు ఎమ్మెల్యేను కలిసి తమ బాధను చెప్పుకొన్నారు.
వెంటనే స్పం దించిన ఆయన వారం రోజుల్లో బెల్ట్‌షాపులను మూసి వేయాలని తీర్మానించి, నిర్వాహకులకు నోటీసులు ఇవ్వాలని పంచాయతీ పాలకవర్గాన్ని ఆదేశించారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ.. బెల్ట్‌షాపులు బంద్చేయకపోతే మహిళలతో కలిసి వచ్చి మద్యం సీసాలను పగులగొడుతానని, ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని స్పష్టంచేశారు. గ్రామాల్లో విచ్చలవిడిగా మద్యం విక్రయాలతో కుటుంబాలు నాశనం అవుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు.