సూర్యాపేటటౌన్, సెప్టెంబర్ 19: సూర్యాపేట జిల్లాలో ఐదు నెలలుగా వేతనాలు అందకపోవడంతో ఆందోళన చెందిన ఓ ఔట్సోర్సింగ్ ఉద్యోగి ఆత్మహత్యకు యత్నించాడు. వేతనాలు రాక కుటుంబం తీవ్ర ఇబ్బందులు పడుతున్నదని, కుమారుడికి వైద్యం కూడా అందించలేని నిస్సహాయ స్థితిలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి మధుసూదన్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. శుక్రవారం నాలుగో రోజు కొనసాగిన ధర్నాలో తన వెంట తెచ్చుకున్న రసాయనం తాగి బలవన్మరణానికి ప్రయత్నించాడు. తోటి ఉద్యోగులు గమనించి దవాఖానలోకి తరలించారు. బాధితుడి పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు జీతాలు ఇస్తేనే ఈ పండుగను ప్రశాంతంగా నిర్వహించుకుంటామని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు వేడుకుంటున్నారు.
ఆత్మహత్య చేసుకుంటేనే జీతాలిస్తరా?: రాంబాబు
ఔట్సోర్సింగ్ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం దురదృష్టకరమని, కాంగ్రెస్ ప్రభుత్వం ఆత్మహత్యలు చేసుకుంటేనే జీతాలు ఇస్తుందా? అని బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబుయాదవ్ ప్రశ్నించారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మధుసూదన్‌ను శుక్రవారం రాత్రి సూర్యాపేట జిల్లా జనరల్ దవాఖానలో పరామర్శించి మాట్లాడారు. భార్యాభర్తలు ఇద్దరూ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు కావడంతో తీవ్ర ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఆరు నెలలు జీతాలు లేకపోతే కుటుంబాలను ఎలా పోషించుకోవాలని ప్రశ్నించారు.