హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు.. మహారాష్ట్ర బతుకును మార్చే భాగ్యరేఖ అని ఆ రాష్ట్రంలోని చంద్రపూర్ జిల్లా రాజూరా తాలూకావాసి బాబురావు మస్కే అన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమించి రాష్ర్టాన్ని సాధించిన తరువాత తెలంగాణ అద్భుతంగా పురోగమిస్తున్నదని కొనియాడారు. తెలంగాణ స్ఫూర్తితో మహారాష్ట్ర పురోమించాలని ఆకాంక్షించారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా శుక్రవారం ఆయన చంద్రపూర్ నుంచి నాగ్‌పూర్ వచ్చారు. జూలై 1 నుంచి తన స్వస్థలం రాజూరా నుంచి హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌కు తన సతీమణి శోభ మస్కేతో కలిసి పాదయాత్ర చేపడతామని ప్రకటించారు. ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసి.. ఆయన అనుమతితో మహారాష్ట్ర వ్యాప్తంగా నాలుగైదు నెలలపాటు 3 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేస్తామని తెలిపారు. యావత్ మహారాష్ట్ర తెలంగాణ మాడల్ కోసం పరితపిస్తున్నదని చెప్పారు. కేసీఆర్ తమ రాష్ర్టాన్ని బాగుచేయాలని కంకణం కట్టుకున్నారని అన్నారు. యావత్ భారతదేశం ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ అని నినదిస్తున్నదని పేర్కొన్నారు. తెలంగాణ రైతులకు దొరికిన అద్భుతం సీఎం కేసీఆర్ అని కొనియాడారు.
ఎవరీ బాబురావు మస్కే
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి మహారాష్ట్ర నుంచి మద్దతు తెలిపిన అనేక మందిలో బాబురావు మస్కే ఒకరు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు ఇస్తూ 2007లో రాజూరా నుంచి తన భార్యతో కలిసి పాదయాత్ర చేశారు. నల్లటి దుస్తులు ధరించి కాళ్లు చేతులకు, మెడకు బేడీలు వేసుకొని పాదయాత్ర చేపట్టి నాటి ఉద్యమ నాయకుడు కేసీఆర్ ప్రసంశలు పొందారు. అప్పటి నుంచి ఆయన కేసీఆర్‌కు వీరాభిమాని. కేసీఆర్ నాయకత్వంలో మహారాష్ట్రలో పురోగమిస్తున్న బీఆర్ఎస్ పార్టీకి గొప్ప భవిష్యత్తు ఉన్నదని బలంగా చెప్తున్నారు.