హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ) : వెళ్తూ.. వెళ్తూ తన అనుయాయులను అందలం ఎక్కించారు ఓ ఉన్నతాధికారి. ఉద్యోగ విరమణ చేయబోయే ముందే తనను నమ్ముకున్న వారికి నిబంధనలకు విరుద్ధంగా పోస్టింగ్ ఇచ్చారు. న్యాయంగా ప్రమోషన్లు రావాల్సినవారిని నాలుగు నెలలు తిప్పించి ప్రమోషన్ ఇవ్వకుండానే వెనక్కి పంపినట్టు ఆయనపై ఆరోపణలున్నాయి. కానీ ఒక్కరికి మాత్రం సచివాలయానికి బదిలీ చేశారు. అటవీశాఖలో పనిచేసే సీనియర్ స్టెనోగ్రాఫర్ ఒకామెకు సెక్రటేరియట్లో నియామకం కల్పించారు. ఇందుకోసం కొన్ని నిబంధనలను సరళీకరించి, ప్రత్యేక కేసుగా పరిగణించి, ఈ మేరకు పోస్టింగ్ ఇస్తూ ఈ నెల 26న ఉత్తర్వులు జారీచేశారు. అర్హతలు కలిగిన పలువురు అభ్యర్థులు పోస్టింగుల కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఆ ఉన్నతాధికారి ఆశీర్వాదం ఆమె ఒక్కరికే దక్కడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి.