యాదాద్రి భువనగిరి, జూలై 3 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యపై అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్లో తప్పుడు వివరాలు పేర్కొన్నందుకు అనర్హత వేటుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్దేశపూర్వకంగా తప్పు చేయలేదని పేర్కొంటూ బీర్ల ఐలయ్య న్యాయవాది కోర్టులో అఫిడవిట్ దాఖలుచేశారు. దీనిపై ఫిర్యాదుదారుడు కూడా అఫిడవిట్ దాఖలు చేయడంతో కేసు విచారణ ఆసక్తికరంగా మారింది. ఈ నెల 22న నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణ జరుగనుంది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఆలేరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన బీర్ల ఐలయ్య తన నామినేషన్‌తోపాటు అఫిడవిట్ దాఖలు చేశారు. అయితే ఆ అఫిడవిట్లో తప్పుడు సమాచారం పొందుపరిచారని ఆరోపిస్తూ అదే నియోజకవర్గానికి చెందిన బొడుసు మహేశ్ అనే సామాజిక కార్యకర్త నిరుడు జూన్‌లో హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. బీర్ల ఐలయ్యపై ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్న భూములు ఆయనకు చెందినవి కావని, పైగా తన భూములను దాచారని తెలిపారు. దీనిపై మూడు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను ఆదేశించిన హైకోర్టు.. ఆ తర్వాత ఫిర్యాదుదారుడు, ఐలయ్యకు నోటీసులు జారీచేసింది. అనంతరం కేసును ప్రజాప్రతినిధుల కోర్టులో తేల్చుకోవాలని సూచిస్తూ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.
బీర్ల ఐలయ్య తరఫు లాయర్ ఏప్రిల్ 24న నాంపల్లి కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. తన భార్య పేరు పెళ్లికి ముందు సుబ్బూరు మహేంద్ర అని, చందుపట్లలో బీర్ల అనిత పేరుపై ఎలాంటి భూములు లేవని ఐలయ్య స్పష్టం చేశారు. అయితే ఎన్నికల ప్రచారం సమయంలో హడావుడిగా అఫిడవిట్ తయారు చేశారని, అందుకే తప్పులు దొర్లాయని, టైపోగ్రాఫికల్ తప్పులు జరిగాయని, ఉద్దేశపూర్వకంగా చేసినవి కావని పేర్కొన్నారు. ఈ నెల 22న కేసుపై విచారణ జరుగనున్న నేపథ్యంలో ఫిర్యాదుదారుడు మహేశ్ మాట్లాడుతూ.. కోర్టులో తప్పకుండా తమకు న్యాయం జరుగుతుందని, కేసు నిరూపితమైతే ఐలయ్యకు ఆరు నెలల జైలు లేదా జరిమానా విధించే అవకాశం ఉంటుందని చెప్పారు. తప్పు జరిగిందని రూ.100 జరిమానా విధించినా.. ఆ వెంటనే బీర్లపై అనర్హత వేటు పడుతుందని, వచ్చే ఆరేండ్లపాటు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి ఆయనకు అవకాశం ఉండదని చెప్పారు.