హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు మంత్రులు గాలి మోటర్లలో వచ్చి గాలి మాటలు చెప్పి వెళ్తున్నారని మాజీ ఎమ్మెల్యేలు బీరం హర్షవర్ధన్‌రెడ్డి, నోముల భగత్, జాజాల సురేందర్ విమర్శించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో శుక్రవారం మీడియాతో వారు మాట్లాడారు. ఈ ప్రభుత్వానికి హనీమూన్ పీరియడ్ అయిపోయిందని, ప్రజలు తిరగబడే రోజులు వచ్చాయని హర్షవర్ధన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు శ్రీశైలం నిర్వాసితులకు అన్యాయం జరిగిందన్న రేవంత్‌రెడ్డి, ఇప్పటికీ వారికి ఎందుకు న్యాయం చేయలేదని ప్రశ్నించారు. శ్రీశైలం నిర్వాసితుల్లో 78 మందికి కేసీఆర్ ప్రభుత్వం లషర్లుగా శాశ్వత ఉద్యోగాలు ఇచ్చిందని గుర్తుచేశారు. ఆనాడే 6 వేల మందికి లషర్ ఉద్యోగాలు ఇవ్వాలనుకొని అందులో శ్రీశైలం నిర్వాసితులకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రతిపాదించారని, దీనికోసం జీవో ఇచ్చారని తెలిపారు.
వెంటనే శ్రీశైలం నిర్వాసితుల సమస్యను పరిషరించాలని, వారికి ఉద్యోగాలు ఇవ్వాలని హర్షవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లా మంత్రులు తమ సొంత పనులకే ప్రాధాన్యం ఇస్తున్నారని నోముల భగత్ ధ్వజమెత్తారు. జిల్లాకు హెలికాప్టర్లో వస్తున్నారే తప్ప ఏ సమస్యనూ పట్టించుకోవడం లేదని విమర్శించారు. మిషన్ భగీరథపై మంత్రి కోమటిరెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని, ఈ పథకంతో నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్ సమస్య దూరమైందని పార్లమెంట్లో కేంద్రమే చెప్పిందని తెలిపారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో నెల్లికల్ లిఫ్ట్‌పై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఆరు వేల ఎకరాలకు నీళ్లిస్తామంటున్నారని, గతంలో కేసీఆర్ 24 వేల ఎకరాలకు నీళ్లివ్వాలని ప్రతిపాదించారని, దానినే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇంకా నాలుగేండ్లు రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని ఎలా భరించాలని ప్రజలు విసిగిపోతున్నారని తెలిపారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ పెద్దలు అబద్ధాలు మాట్లాడుతున్నారని, నిజాలతో కూడిన బుక్‌లెట్‌ను వారికి పోస్టులో పంపుతామని ప్రకటించారు. ఆరు గ్యారెంటీలపై గాలి మాటలు చెప్పి కాంగ్రెస్ నేతలు తప్పించుకుంటున్నారని జాజల సురేందర్ విమర్శించారు. కేసీఆర్‌పై విమర్శలు తప్ప రేవంత్‌రెడ్డి సాధించిందేమీ లేదంటూ ఎద్దేవా చేశారు. సంపూర్ణ రుణమాఫీ అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.