హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన సొంత జిల్లా పాలమూరుకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి అన్నారు. యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ శంకుస్థాపన కోసం కొల్లాపూర్‌కు వస్తున్న సీఎం షెడ్యూల్లో అక్కడికి దగ్గరలోనే ఉన్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు సందర్శన లేకపోవడం శోచనీయమని ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌తో కలిసి ఆయన మాట్లాడారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు ఇప్పటికే 90 శాతం పూర్తయ్యాయని, మిగతా పనులు పూర్తి చేయాల్సిన బాధ్యత రేవంత్‌కు లేదా? అని ప్రశ్నించారు. జూరాల ప్రాజెక్టు నుంచి నీళ్లు కిందకు వెళ్తున్నప్పటికీ, నెల రోజుల నుంచి కాల్వలకు నీళ్లు వదలడం లేదని ఆరోపించారు. హరీశ్‌రావు ప్రెస్‌మీట్ పెట్టి ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిలదీస్తేనే కల్వకుర్తి లిఫ్ట్‌లు ఆన్ చేశారని పేర్కొన్నారు. కొల్లాపూర్‌కు కేసీఆర్ మామిడి మార్కెట్ కేటాయిస్తే, కాంగ్రెస్ పాలకులు ఆ మార్కెట్‌కు నిధులు విడుదల చేయడం లేదని ఆరోపించారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు ఎక్కువయ్యాయని పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి సభ పెడుతున్న పెంట్లవెల్లిలో సహకార సొసైటీ కింద ఇచ్చిన రైతు రుణాలు ఇప్పటికీ మాఫీ కాలేదని ఆరోపించారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నల్లమల పులిబిడ్డో, పిల్లిబిడ్డో అస్సలు అర్థం కావడం లేదని మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ ఎద్దేవా చేశారు. పాలమూరు బిడ్డను అని చెప్పుకునే ఆయన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ పాలనలో కల్వకుర్తి నియోజక వర్గంలో ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదని, పాలమూరు బిడ్డవై ఉండి ఇక ఏం లాభమని మండిపడ్డారు.
కల్వకుర్తి పంపులు ఆన్ చేసినా చివరి ఆయకట్టుకు నీళ్లు రావడం లేదని పేర్కొన్నారు. కేసీఆర్ హయాంలో కల్వకుర్తి రైతాంగానికి నీళ్లు వచ్చాయని తెలిపారు. ముగ్గురు మంత్రులు ఈ నియోజకవర్గంలో పర్యటించి గతంలో వేసిన శిలాఫలకాలు మార్చి, కొబ్బరికాయలు కొట్టిపోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. కేసీఆర్ హయాంలో మంజూరైన కళాశాలలు, దవాఖానల పట్ల రేవంత్‌రెడ్డి నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని దుయ్యబట్టారు. ఆరు గ్యారంటీలు కాదు కదా, అర గ్యారెంటీ కూడా అమలు కాలేదని అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నేత అభిలాష్ రంగినేని పాల్గొన్నారు.