Liquor Price | హైదరాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ) : మద్యం ధరల పెంపు ఇష్టం లేనేలేదనుకుంటూనే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క బీరుపై గరిష్ఠంగా రూ.40 పెంచింది. మద్యం ప్రియులు ఎక్కువగా తాగే ఓ బ్రాండ్ బీరు ధర గరిష్ఠంగా రూ.260కి చేరింది. బీరు సప్లయ్ కంపెనీల మార్జిన్ కోసం అంటూ తెలంగాణ ప్రభుత్వం, రిటెయిలర్ మార్జిన్ కోసం అంటూ ఏపీ ప్రభుత్వం ఒకే రోజు మద్యం ధరలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. రెండు రాష్ర్టాల్లో ఒకేరోజు మద్యం ధరలు పెరగుతూ ఉత్తర్వులు రావటం యాదృచ్ఛికం కాదని, ఇరు రాష్ర్టాల ముఖ్యనేతలు పక్కాగా కూడబలుక్కొనే మద్యం ధరలు పెంచారనే చర్చలు మద్యం మార్కెట్ వర్గాల్లో జోరుగా నడుస్తున్నాయి. మొత్తంలో ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్ ఇతర పన్నులు పోను మిగిలిన సొమ్మంతా బ్రూవరీల జేబుల్లోకే పోనుంది.
పెంపుపై ముందే చెప్పిన ‘నమస్తే తెలంగాణ’
డిస్టిలరీలు, బ్రూవరీలు, సప్లయ్ కంపెనీలు కోరిన బేసిక్ ధరలు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏనాడో సిద్ధమైందని, నేడో రేపో ధరల పెంపు ఖాయమని, ప్రజా వ్యతిరేకతను తప్పించుకునేందుకు, మద్యం ప్రియులను ఏమార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం, బ్రూ వరీలు కలిసి బీర్ల బందు నాటకాన్ని రక్తి కట్టించిన విషయాన్ని బట్టబయలు చేస్తూ ‘నమస్తే తెలంగాణ’ వరుస కథనాలను ప్రచురించింది. వాస్తవానికి సీఎం రేవంత్‌రెడ్డి దావోస్ పర్యటన ముగించుకొని వచ్చిన మరుసటి రోజే బీర్ల ధరలు పెంచుతూ ఉత్తర్వులు రావాల్సి ఉన్నదని, కానీ ‘నమస్తే తెలంగాణ’ కథనాల నేపథ్యంలో కొంత కాలం వాయిదా వేసినట్టు వ్యాపార వర్గాలు చెప్తున్నాయి. రేవంత్‌రెడ్డి సీఎం కాగానే మద్యం కంపెనీల ప్రతినిధులు మర్యాద పూ ర్వకంగా కలిసి బేసిక్ ధర పెంచాలని వినతి పత్రాలు ఇచ్చారు. 2019 నుంచి కేసీఆర్ ప్రభుత్వం బీర్ల ధరలు పెంచలేదని ఫిర్యాదు చేశారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తొలి ఫేవర్ కింద సోం డిస్టిలరీకి చెందిన బ్లాక్‌ఫోర్డ్, హంటర్, వుడ్పీకర్ బీర్లను రాష్ట్రంలోకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్య తిరేకించడంతో వెనక్కి తగ్గింది. ఎక్సైజ్ మంత్రి జూపల్లి మీడియా ముందుకు వచ్చి సోం డిస్టిలరీ ఉత్పత్తులకు అనుమతి ఇవ్వలేదని ప్రకటించారు. మరుసటి రోజే నాలుక కరుచుకొని సోం బీర్లకు టీఎస్‌బీసీఎల్ అనుమతించిందని చెప్పారు.
పక్క రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే..
పక్క రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే మద్యం వ్యాపారులు అటునుంచి నరుక్కురావటం మొదలు పెట్టారని, అక్కడి ముఖ్యనేత కనుసన్నల్లో టీఎస్‌బీసీఎల్ కార్యకలాపాలు కొనసాగుతూ వస్తున్నాయని మద్యం మార్కెట్లో చర్చ జరిగింది. పక్క రాష్ట్రంలో మద్యం పాలసీ అమల్లోకి వచ్చి, ప్రభుత్వ ఆధీనంలో ఉన్న మద్యం దుకాణాలు ప్రైవేట్ పరం చేసిన సమయంలో అక్కడ ధరల నిర్ణయ కమిటీ రూపుదిద్దుకున్నది. కమిటీలోకి పొరుగు రాష్ట్రం ముఖ్యనేత తనకు అత్యంత నమ్మకస్తుడిగా ఉన్న సీనియర్ ఐఏఎస్‌ను చొప్పించినట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. అన్నట్టుగానే ఏపీ క్యాడర్‌కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కమిటీలోకి వచ్చారు. అట్లాగే తెలంగాణలో మద్యం వ్యాపారంలో బాగా ఆరితేరిన ఎమ్మెల్యే స్థాయి ప్రతినిధిని కమిటీలో సభ్యుడిగా చేర్చేందుకు ప్రయత్నా లు జరిగాయి.
కానీ నిబంధనలు అంగీకరించకపోవటంతో ఆయనకు అనధికారిక బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం.ఈ ఇద్దరి కనుసన్నల్లోనే ధరల నిర్ణయం జరిగినట్టు వ్యాపార వార్గలు చెప్తున్నాయి. తాము తయారు చేసే బీర్లను తెలంగాణలో ఇక మీదట విక్రయించబోమని ఓ కంపెనీ నేషనల్ స్టాక్ ఎక్సేంజ్‌కు, బాంబే స్టాక్ ఎక్సేంజ్‌కు సమాచారం ఇచ్చింది. ప్రభుత్వ పెద్దలు కొందరు మీడియా ముం దుకు వచ్చి రాష్ట్రంలో పెద్ద మార్కెట్ ఉన్న బీర్లు బందైపోయాయని, జరగరాని ఉపద్రవం ఏదో జరిగిపోయినట్టుగా బిల్డప్ ఇచ్చారు. ఎక్సైజ్ మంత్రి బీర్ల కంపెనీలు 33 శాతం పెంచాలని అడుగుతున్నాయని, ఇలా పెంచితే ప్రభుత్వం మీద భారం పడుతుందని చెప్పారు. తెలంగాణలో రేట్లు తక్కువే ఉన్నాయని చెప్పారు. తర్వాత సీఎం అత్యవసర సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. తర్వాత బీర్ల సరఫరాను కంపెనీ పునరుద్ధరించింది. పాలకులు, సప్లయ్ కంపెనీ లోగుట్టును పసిగట్టిన ‘నమస్తే తెలంగాణ’ ‘ైక్లెమాక్స్‌కు లిక్కర్ రేట్లు’ శీర్షికతో బీర్ల రేట్ల పెంపును బట్టబయలు చేసింది. ధరల నిర్ణయ కమిటీ నివేదిక మేరకు తాజాగా 3 రకాల బీరు క్యాటగిరీలతో బేసిక్ ధరను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే రోజున పొరుగు రాష్ట్రంలోనూ 14 శాతం మార్జిన్ పెంచుతున్నట్టు అక్కడి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రతిదీ పక్కాగా
మద్యం ధరలు పెంచే మొత్తం ఎపిసోడ్లో రాష్ట ప్రభుత్వం ప్రతిదీ పక్కా ప్రణాళికతోనే చేసినట్టు స్పష్టమవుతున్నది. ధరల నిర్ణయ కమిటీ వేసే దగ్గర నుంచి మొదలు పెట్టి ధరలు పెంచే వరకు అన్నీ రెండు రాష్ర్టాల ముఖ్యనేతల కనుసన్నల్లోనే జరిగినట్టు వ్యాపార వర్గాలు చెప్తున్నాయి. రెండు రాష్ర్టాల మద్యం ధరలు, డిస్టిలరీలకు చెల్లింపులు, సుంకాలు ఒకే తరహాలో ఉంటే న్యాయపరమైన ఇబ్బందులు ఉండవు. కాగ్ కూడా పొరుగు రాష్ట్రాల ఎమ్మార్పీ, బేసిక్ ధరలను సరిపోల్చి నివేదికలు రూపొందిస్తుంది. ఈ నేపథ్యంలో కాగ్ లాంటి కేంద్ర ఆడిట్ సంస్థలకు దొరక్కుండా ఉండేందుకు, ప్రజలను ఏమార్చేందుకే ఇంత పెద్ద నాటకమాడినట్టు చర్చ నడుస్తున్నది.