Liquor Prices | హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో భారీగా బీర్ల ధరలు పెరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఎక్సైజ్ కమిటీ గురువారం ఆబ్కారీభవన్లో సమావేశమైంది. ప్రభుత్వం ఇటీవల నిర్దేశించిన రూ.వేల కోట్ల లక్ష్యాన్ని చేరుకోవాలంటే మద్యం ధరల పెంపు ఒక్కటే పరిష్కారమార్గంగా కనిపిస్తున్నది. దీనికితోడు ప్రభుత్వ పథకాలు యథావిధిగా కొనసాగాలంటే తక్షణం బీర్ల ధరలను పెంచాల్సిందేనని తెలుస్తున్నది. అయితే, బీర్ల ధరల పెంపుపై గురువారం సమావేశమైన ఎక్సైజ్ కమిటీ.. ధరల పెంపుపై తర్జన భర్జనలు చేసినట్టు తెలిసింది. ప్రభుత్వ పెద్దల డైరెక్షన్లోనే సుమారు 15-20 శాతం ధరలు పెంచేందుకు ఓ నిర్ణయానికి వచ్చినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. బీర్ల ఉత్పత్తి కేంద్రాల (బ్రూవరీల)కు ప్రస్తుతం ప్రభుత్వం చెల్లిస్తున్న ధరలను 10-15శాతం మేర పెంచాలని, ఆ నష్టాన్ని పూడ్చుకొనేందుకు, ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుకునేందుకు 15-20 శాతం ధరలు పెంచాలని నిర్ణయించినట్టు తెలిసింది. కాగా, భారం పూర్తిగా వినియోగదారులపైనే పడనున్నది.
తెలంగాణలోని 6 బ్రూవరీల్లో ఏటా 88 కోట్ల లీటర్ల బీరు ఉత్పత్తి అవుతున్నది. ఆ బీరును తెలంగాణ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ కొనుగోలుచేసి మద్యం దుకాణాలకు సరఫరా చేస్తుంది. 12 బీర్లు ఉండే ఒక కేసుకు బేవరేజెస్ కార్పొరేషన్ లైట్ బీర్లకు రూ.289, స్ట్రాంగ్ బీర్లకు రూ.313 చెల్లిస్తున్నది. అక్కడి నుంచి మద్యం దుకాణాలకు రూ.1,400 చొప్పున చేరుతున్నది. మద్యం దుకాణాలు ఒక్కో కేసు రూ.1,800 చొప్పున అమ్ముకుంటున్నాయి. తయారీ కేంద్రాల వద్ద సుమారు రూ.24కి లభించే ఒక బీరు.. కార్పొరేషన్ చేతి నుంచి మద్యం దుకాణాలకు వచ్చేసరి రూ.117.. వినియోగదారులకు వచ్చేసరికి రూ.150 అవుతున్నది.
తమకు నిర్వహణ ఖర్చులు భారీగా పెరిగాయని, 2021 నుంచి ఇప్పటి వరకు ధరలు పెంచలేదని.. ఇప్పుడు కనీసం 20-25 శాతం ధరలు పెంచాలని అన్ని బ్రూవరీలు ఎక్సైజ్ కమిటీ ముందు ప్రతిపాదన పెట్టాయి. ఈ నెల మొదటి వారంలో ఒక్కో రోజు ఒక్కో బ్రూవరీ ప్రతినిధులను పిలిచి.. ఎక్సైజ్ కమిటీ విడివిడిగా మాట్లాడింది. గతంలో ఒక్కో కేసుకు రూ.289 ఉంటే.. పెరిగిన నిర్వహణ దృష్ట్యా తమకు రూ.450 ఇవ్వాలని ఆ ప్రతినిధులు డిమాండ్ చేశారు. బ్రూవరీలకు అడిగినంతా రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ ఇవ్వాల్సి వస్తే.. బీర్ల ధరలు కనీసం 20 శాతం పెరగనున్నట్టు తెలిసింది.
మద్యం ఆదాయాన్ని మరో రూ.5,318 కోట్లు పెంచాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకొన్నది. ఎక్సైజ్‌శాఖలోని ఒక్క మద్యం విభాగం నుంచే రూ.25,617 కోట్ల నిధులను ఆశిస్తున్నట్టు వెల్లడించింది. ఆ మేరకు ఇప్పుడు బీర్ల ధరల పెంపునకు సిద్ధమైంది. ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలంటే బీర్లు, లిక్కర్ కలిపి కనీసం 25 శాతం అదనంగా మద్యం అమ్మకాలు చేపట్టాల్సి ఉన్నది. దీంతో మరింత తాగించడం ఒకటి కాగా, రెండోది ధరలు పెంచడమే మార్గంగా కనిపిస్తున్నది. సరారుకు వస్తున్న ఆదాయ వనరుల్లో మద్యానిదే ప్రధాన పాత్ర. మద్యం అమ్మకాలు, ట్యాక్స్‌ల ద్వారా ఏటా సుమారు రూ.35 వేల కోట్ల వరకు సరారుకు ఆదాయం సమకూరుతున్నది. ఈ లక్ష్యాన్ని ప్రభుత్వం రూ.45 వేల కోట్లకు పెంచింది. ఈ క్రమంలోనే బీర్ల ధరలకు త్వరలో రెక్కలు రాబోతున్నాయి.
బీర్ల ధరల పెంపుపై గురువారం సమావేశమైన ఎక్సైజ్ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి ధరల పెంపు ప్రతిపాదనలు పంపినట్టు తెలిసింది. దీనిపై ప్రభుత్వ పెద్దలు ఓ నిర్ణయం తీసుకోనున్నారు. బీర్ల ధరలు పెంచితే కొత్త ధరలను వినాయక నిమజ్జనం రోజునే అమల్లోకి తెస్తారని సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు కేవలం బీర్ల ధరలే పెరగనున్నాయి. ఇతర లిక్కర్ ధరలు యథావిధిగా ఉంటాయి. ఈ మేరకు మద్యం ఉత్పత్తిదారులతో ఒప్పందం చేసుకున్నట్టు తెలిసింది.