ములుగు : పోలీసులను లక్ష్యంగా చేసుకుని బీర్ బాటిల్లో ఐఈడీని అమర్చిన మావోయిస్టుల కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ములుగు జిల్లాలోని రిజర్వ్ ఫారెస్టుకు సమీపంలోని పామునూరు గ్రామ పరిసరాల్లో ఈ నెల 17వ తేదీన పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. అయితే ఆ ఏరియాలో బీర్ బాటిల్లో ఐఈడీని అమర్చి ఉంచడాన్ని పోలీసులు పసిగట్టి, దాన్ని నిర్వీర్యం చేసినట్లు ఏటూరు నాగారం ఏఎస్సీ సిరిశెట్టి సంకీర్త్ ఒక ప్రకటన విడుదల చేశారు.
వెంకటాపురం సీఐ కే శివప్రసాద్, ఎస్ఐ తిరుపతి, స్పెషల్ పార్టీ పర్సనల్, సీఆర్పీఎఫ్ 39(ఎఫ్) బెటాలియన్ ఆఫీసర్లు, బాంబు డిటెక్షన్, డిస్పోజబుల్ బృందాలు పామునూరు పరిసరాల్లో కూంబింగ్ నిర్వహించాయి. ఆ ఫారెస్టులో కూంబింగ్ నిర్వహిస్తుండగా, విద్యుత్ తీగలు లభ్యమయ్యాయి. ఈ తీగలను పరిశీలించడంతో.. సమీపంలోని ఓ బీర్ బాటిల్లో ఐఈడీ బాంబును మావోయిస్టులు పాతిపెట్టినట్లు పోలీసులు ధృవీకరించారు. అనంతరం ఆ ఐఈడీని నిర్వీర్యం చేశారు పోలీసులు.
ఈ ఘటనకు సంబంధించి సీపీఐ మావోయిస్టు లీడర్లు పుల్లూరి ప్రసాద్ రావు, బాదే చొక్కారావు, కొయ్యాడ సాంబయ్య, కంకణాల రాజిరెడ్డితో పాటు మరో ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.