BEd | హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): ఇది వరకు బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్(బీఈడీ) చదివితే టీచర్ ఉద్యోగం పక్కా.. కానిప్పుడు నిరుద్యోగం పక్కా అన్నట్టుగా పరిస్థితులున్నాయి. బీఈడీ చదవడమే అభ్యర్థుల పాలిట శాపంగా మారింది. టీచర్లకు పదోన్నతులు కల్పించే నిబంధనలు వారికి అడ్డుగా నిలుస్తున్నాయి. గతంలో ఎస్జీటీ పోస్టులకు పోటీపడే అవకాశముండటంతో అభ్యర్థులు పెద్ద మొత్తంలో బీఈడీ కోర్సుల్లో చేరారు. కానీ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ఎస్జీటీ పోస్టులను డీఎడ్ వారితోనే భర్తీచేస్తున్నారు. దీంతో 5లక్షలకు పైగా బీఈడీ అభ్యర్థులకు అన్యాయం జరుగుతుండగా..వారు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. న్యాయం చేయాలని కోరు తూ అభ్యర్థులు 3న చలో ఇందిరాపార్క్‌కు పిలుపునిచ్చారు. స్పందించకుంటే ఆమరణదీక్షకు దిగుతామన్నారు.
ఎస్జీటీ పోస్టులను 100శాతం డీఎడ్ వారితో భర్తీచేసినట్టే స్కూల్ అసిస్టెంట్ పోస్టులను వందశాతం బీఎడ్ అభ్యర్థులతోనే నింపాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. లేదా 20శాతం పోస్టులను పదోన్నతుల ద్వారా నింపి, 80 శాతం పోస్టులను రిక్రూట్మెంట్ ద్వారా భర్తీచేయాలని కోరుతున్నారు. డీఎస్సీ-2024లో కేవలం 2,629 ఎస్ఏ పోస్టులను సోషల్‌కు 42వేలు, జీవశాస్త్రం 34వేలు, గణితంకు 28వేల చొప్పున అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్క పోస్టుకు వేలాది మంది పోటీపడుతున్నారు. దీంతో టీచర్ల పదోన్నతుల నిష్పత్తిని మార్చాలని బీఈడీ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.
పదోన్నతుల్లో అనుసరిస్తున్న నిష్పత్తితో బీఈడీ అభ్యర్థులకు తీరని అన్యాయం జరుగుతున్నది. ఒక్క పోస్టుకు వేలాది మంది పోటీపడుతున్నారు. కొన్ని జిల్లాల్లో పోస్టుల్లేక వదులుకోవాల్సిన పరిస్థితి ఉంది. ప్రభుత్వం చొరవ తీసుకుని పదోన్నతుల విధానాన్ని సవరించి వందశాతం ఎస్ఏ పోస్టులను బీఈడీ వారితోనే భర్తీచేయాలి. ఇలా చేస్తేనే 5లక్షల మంది బీఈడీ అభ్యర్థులకు న్యాయం జరుగుతున్నది. పాఠశాల విద్యను బోర్డ్ ఆఫ్ ప్రైమరీ ఎడ్యుకేషన్, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్‌గా విభజించాలి.
– భూక్య కుమార్, బీఈడీ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు