హైదరాబాద్ : రాష్ట్రంలో రానున్న రెండు రోజుల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున రాష్ట్రంలోని పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని డీజీపీ అంజనీ కుమార్ (DGP Anjani kumar ) ఆదేశించారు. వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు చేపట్టాల్సిన ముందుజాగ్రత్త చర్యలపై పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో బుధవారం రాత్రి వీడియో కాన్ఫరెన్స్ (Video Conference) నిర్వహించారు.
డీజీపీ మాట్లాడుతూ పోలీస్ యంత్రాంగం (Police Department ) 24గంటలు అందుబాటులో ఉంటారని సహాయం కోసం డయల్100 కి లేదా స్థానిక పోలీసులకు గానీ సమాచారం అందించాలని సూచించారు. గురువారం దాదాపుగా 8 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో రెడ్ అలర్ట్ (Red Alert ) ప్రకటించారని వెల్లడించారు. హైదరాబాద్‌లోనూ భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించిందని పేర్కొన్నారు.
ఎన్డీఆర్ఎఫ్ (NDRF) బృందాలను ఉపయోగించుకోవాలి
అత్యవసర పరిస్థితుల్లో ఎన్డీఆర్ఎఫ్ (NDRF) బృందాలను ఉపయోగించుకోవాలని అన్నారు. రైతులు పొలాల్లో విద్యుత్ మోటార్ల వద్ద జాగ్రత్తగా ఉండాలి, వర్షాలు పడేటప్పుడు విద్యుత్ స్తంభాలను , వైర్లను చేతులతో తాకవద్దని సూచించారు. వర్షాలకు కల్వర్టు, చిన్న చిన్న బ్రిడ్జి ల వద్ద నీరు ప్రవహిస్తున్నప్పుడు వాహనాలతో దాటడానికి సాహసం చేయవద్దని కోరారు.
ఇప్పటికే గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల పలు ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు పూర్తిగా నిండాయని, ఈ జలాశయాల వద్దకు ఎవరు వెళ్లకుండా తగు ముందు జాగ్రత చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వరద ఉధృతితో తెగిపోయిన రోడ్లు, ఉధృతంగా ప్రవహించే కాజ్ వే ల వద్దకు ప్రజలు వెళ్లకుండా, రెండు దిక్కులా ప్లాస్టిక్ కోన్స్, బారిగేడ్స్, హెచ్చరిక గల ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలన్నారు.
ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్తగా ట్రాఫిక్ డైవర్షన్ (Traffic Diversion ) చేయాలని సూచించారు. గోదావరికి వస్తున్న వరద కారణంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల లోని లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని వెల్లడించారు.