కాంగ్రెస్ ప్రభుత్వంపై రాష్ట్రవ్యాప్తంగా రో జురోజుకూ నిరసనలు వెల్లువెత్తుతూనే ఉన్నా యి. సోమవారం పలు జిల్లాలో సమస్యల పరిష్కారం కోసం వివిధ వర్గాలవారు ఆందోళన బాటపట్టారు. సిద్దిపేట, నాగర్కర్నూల్ జిల్లాల్లో పాడి రైతులు బిల్లులు చెల్లించాలని ధర్నా చేశారు. మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో పింఛన్లు, జీవనభృతి చెల్లించాలని బీడీ కార్మికులు రోడ్డెక్కారు. మహబూబ్నగర్ జిల్లాలో భూ సమస్యను పరిష్కరించాలని తల్లీకొడుకు, కామారెడ్డి జిల్లాలో డబ్బులు తీసుకుని భూమి పట్టా చేస్తలేరని రైతు ప్రజావాణిలో ఆత్మహత్యాయత్నం చేశారు. భువనగిరి జిల్లాలో డబు ల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులు తహసీల్ ఆఫీస్కు తాళం వేసి నిరసన తెలిపారు.
ములుగు, సిద్దిపేట జిల్లాల్లో దళితబంధు పథకం అమలు చేయాలని లబ్ధిదారులు ఆందోళన చేశారు. ఖమ్మం జిల్లా మణుగూరులో బ్రీత్ అనలైజర్ లు సరిగా పనిచేస్తలేవని, మద్యం తాగని తమకు రీ టెస్ట్ చేయాలని ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లు ఆందోళనలు చేశారు. మనఊరు- మనబడి పనుల బిల్లులు చెల్లించాలంటూ జగిత్యాల జిల్లా రేగుంట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోకి గొర్రెలనుతోలి నిరసన వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్ జిల్లాల్లో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జీపీ కార్మికులు దీక్ష చేపట్టారు. వరంగల్ జిల్లాలో రుణమాఫీ కోసం రైతులు ఆందోళన చేపట్టా రు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో తాగునీటి కోసం మహిళలు రోడ్డెక్కారు.
దళితబంధు నిధులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ములుగు కలెక్టరేట్ ఎదుట లబ్ధిదారులు ధర్నా నిర్వహించారు. కలేక్టరేట్ వరకు ర్యాలీగా వచ్చి కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. దళిత బంధు సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్, కోఆర్డినేటర్ రమేశ్, సలహాదారు సంజీవ, నాయకులు పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పినట్టు వారంలోగా రెండో విడత దళితబంధు నిధులను విడుదల చేయాలని దళిత బంధు సాధన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సిద్దిపేట కలెక్టరేట్ ఎదుట లబ్ధిదారులతో కలిసి ధర్నా నిర్వహించి అనంతరం కలెక్టర్ మనుచౌదరికి దరఖాస్తులు అందజేశారు.
-సిద్దిపేట కలెక్టరేట్/ములుగురూరల్
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రేగుంట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ‘మన ఊరు-మనబడి’లో భాగంగా అభివృద్ధి పనులకు గతేడాది అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.20 లక్షలు మంజూరు చేసింది. అప్పటి విద్యాకమిటీ చైర్మన్ దండిక శంకర్ సొంత డబ్బులతో పనుల పూర్తి చేశాడు. దీనికి సంబంధించి బిల్లులు రాకపోవడంతో వృత్తిరీత్యా గొర్రెల కాపరిగా జీవనం కొనసాగిస్తున్న శంకర్ తాను పాఠశాలలో నిర్మించిన డైనింగ్హాల్లో గొర్రెలనుతోలి నిరసన తెలిపారు.
-మల్లాపూర్
రెండున్నర నెలలుగా విజయ డెయిరీలో తమకు బిల్లులు చెల్లిండం లేదని నిరసిస్తూ పాడి రైతులు సిద్దిపేటలో విజయ డెయిరీ సెంటర్ నుంచి ముస్తాబాద్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. నాగర్కర్నూల్ జిల్లా ఉప్పునుంతల పోచమ్మ చౌరస్తాలో 20 లీటర్ల గేదె, ఆవు పాలు పారబోసి నిరసన తెలిపారు. పాడిని నమ్ముకొని పలువురు రైతులు జీవిస్తున్నారని, బిల్లులు రాకపోవడంతో నిత్యావసర సరుకులు కొనుగోలు చేయలేని స్థితిలో ఉన్నారని వాపోయారు.
-సిద్దిపేట/ఉప్పునుంతల
డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులతో కలిసి అభిలపక్షం నాయకులు భువనగిరి తహసీల్దార్ కార్యాలయం గేటుకు తాళం వేసి ఆందోళన చేపట్టారు. అనంతరం తహసీల్దార్ అంజిరెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. నాయకులు కిరణ్కుమార్, భగత్, బబ్లు, సుభాష్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
-భువనగిరి కలెక్టరేట్
భూ సమస్యను పరిష్కరించాలని మహబూబ్నగర్ కలెక్టరేట్లోని ప్రజావాణిలో హన్వాడ మండలం చిన్నదర్పల్లి పరిధి హనుమాన్ టెంపుల్ తండాకు చెందిన తల్లీకొడుకు ఆమనిబాయి, కెడావత్ రాములు ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకోబోయారు. పోలీసులు వారి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. కామారెడ్డి జిల్లా పెద్దగొడప్గల్ మండలం వడ్ల గ్రామానికి చెందిన రైతు గైని అంజయ్య తన పేరు మీద భూమి పట్టా చేయడం లేదంటూ ప్రజావాణిలో ఆత్మహత్యాయత్నం చేశాడు.
-మహబూబ్నగర్ కలెక్టరేట్/పెద్దకొడప్గల్
సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గ్రామపంచాయతీ కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఒకరోజు దీక్ష చేపట్టారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని కార్యాలయ అధికారులకు అందజేశారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం సుర్బిర్యాల్ గ్రామపంచాయతీలో జరిగిన నిధుల దుర్వినియోగంపై విచారణ జరిపించాలని కోరుతూ వీడీసీ సభ్యులు కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. అనంతరం ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు.
-అశ్వారావుపేట టౌన్/కంఠేశ్వర్
వరంగల్ జిల్లా సంగెం మండలం చింతలపల్లి పీఏసీఎస్ ఎదుట రుణమాఫీ కోసం రైతులు నిరసన వ్యక్తం చేశారు. సంఘంలో చింతలపల్లి, కృష్ణానగర్, పల్లార్గూడ, మొండ్రాయి, కుంటపల్లి గ్రామాల రైతులు 644 మంది సభ్యులుగా ఉన్నారు. వీరు ఎస్బీఐద్వారా 2017లో రుణం తీసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేసిన రుణమాఫీ వర్తిస్తుందని ఆశగా ఎదురుచూసిన తమకు కన్నీరే మిగిలిందని అన్నదాతలు వాపోయారు.
-సంగెం
బీడీ కార్మికులకు జీవనభృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మెదక్ కలెక్టరేట్ ఎదుట తెలంగాణ బీడీ సిగార్ వరర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, కార్యదర్శి బాలమణి, బీడీ కార్మికులు పాల్గొన్నారు. పింఛన్లను పెంచాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా సిరికొండ తహసీల్ ఆఫీస్ ఎదుట బీడీ కార్మికులు ధర్నా నిర్వహించారు.
-మెదక్/ సిరికొండ
సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలోని 4వ వార్డులో కొన్ని రోజులుగా తాగునీరు రావడం లేదని మహిళలు తహసీల్దార్ కార్యాలయానికి ఖాళీ బిందెలతో వచ్చి నిరసన తెలిపారు. పైప్లైన్ల మరమ్మతులు చేయాలని పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్ కాటమయ్యకు వినతిపత్రం అందజేశారు. సీపీఐ మండల కార్యదర్శి రామస్వామి, మహిళలు పాల్గొన్నారు.
-తుంగతుర్తి
మద్యం అలవాటు లేనివాళ్లు కూడా మద్యం తాగినట్లు చూపుతున్న బ్రీత్ అనలైజర్ను మార్చకుండా డ్రైవర్లను ఇబ్బందులకు గురి చేయడం సరికాదంటూ ఆర్టీసీ మణుగూరు డిపో అద్దె బస్సు డ్రైవర్లు, సిబ్బంది బస్సులు నిలిపివేసి నిరసన చేపట్టారు. ఇఫ్టూ నాయకుడు మిడిదొడ్ల నాగేశ్వరరావు సంఘీభావం తెలిపారు. మద్యం అలవాటులేని ఓ కార్మికుడిని సస్పెండ్ చేసిన అంశంపై పునరాలోచన చేయాలని కోరారు. ఆర్టీసీ డీఎం శ్యాంసుందర్ స్పందిస్తూ.. ఉన్నతాధికారులతో చర్చించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
-మణుగూరు టౌన్