కాచిగూడ, జూలై 18: బీసీల సమస్యల పరిష్కారం కోరుతూ ఆగస్టు 5, 6, 7 తేదీల్లో వేలాది మందితో పార్లమెంట్ ముట్టడిస్తామని ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య వెల్లడించారు. గురువారం హైదరాబాద్ కాచిగూడ అభినందన్ హోటల్లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం, కన్వీనర్ గుజ్జ కృష్ణ ఆధ్వర్యంలో 13 బీసీ సంఘాలు, 30 కుల సంఘాల నాయకులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
దేశ జనాభాలో దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని, అందుకు పార్లమెంట్లో రాజ్యంగ సవరణ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమం తరహాలో బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. బీసీలకు సామాజిక న్యాయం అందకపోతే కేంద్రంపై మిలిటెంట్ పోరాటం చేస్తామని ప్రకటించారు.
మాజీ ఎంపీ వీ హనుమంతరావు మాట్లాడుతూ పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. వికసిత్ భారత్ అంటే అంబానీ, ఆదానీ కాదని, దేశంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీలైన బహుజనులను బాగు చేయడమని సూచించారు. సమావేశంలో బీసీ నేతలు ఆర్ లక్ష్మణ్యాదవ్, నీలా వెంకటేశ్, నందగోపాల్, వీ రామకృష్ణ, జీ మల్లేశ్, ఉదయ్, జయంతి, జ్యోతి, కరుణశ్రీ, శివమ్మ, అంజి, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.