హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమ స్తే తెలంగాణ) : బీసీలకు న్యాయమైన వాటా దక్కేదాకా పోరాడాలని జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య ఉద్బోధించారు. శాసనమండలిలో బీఆర్ఎస్ పక్ష నేత సిరికొండ మధుసూదనాచారి నేతృత్వంలోని బీసీ నాయకులు జస్టిస్ ఈశ్వరయ్య నివాసంలో సోమవారం సమావేశం అయ్యారు. బీసీలకు దక్కాల్సిన వాటా కోసం.. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్, బీసీ కులగణన వంటి అంశాల అమలుకు బీఆర్ఎస్ చేస్తున్న ఒత్తిడిలో భాగంగా ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఈ క్రమంలో బీసీ ప్రతినిధుల బృందం జస్టిస్ ఈశ్వరయ్యతో సమావేశం ప్రాధాన్యతను సంతరించుకున్నది. ఈ సందర్భంగా జస్టిస్ ఈశ్వరయ్య మాట్లాడుతూ.. ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు, సమగ్ర కులగణన సాధ్యమేనని పేర్కొన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ సాధన కోసం బీసీలు అగ్రభాగాన నిలిచారని, అదే స్ఫూర్తితో బీసీల హక్కుల సాధన కోసం ఉద్యమించాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు.
‘మేమెంతో మాకంతా, మా వాటా మాకే’ అనే నినాదాలతో ముందుకెళ్లాలని నిర్ణయించారు. స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మన హకుల కోసం పోరుబాటకు ఇదే సరైన సమయం అని సమావేశంలో నేతలు అభిప్రాయపడ్డారు. చట్టసభల్లో 33 శాతం, స్థానిక ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలుచేయాల్సిందిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తున్నామని, ఇందులో భాగంగానే బీసీ మేధావి వర్గాన్ని కలుస్తున్నామని ప్రతినిధుల బృందం జస్టిస్ ఈశ్వరయ్యకు వివరించింది. సమావేశంలో రాజ్యసభ సభ్యుడు రవిచంద్ర, ఎమ్మెల్సీలు రమణ, శంభీపూర్ రాజు, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, బీసీ ఉద్యమనాయకులు గంగాధర్‌గౌడ్, కర్నె ప్రభాకర్, భిక్షమయ్యగౌడ్, భగత్, రాకేశ్, ఆంజనేయులు, చెరుకు సుధాకర్, పల్లె రవికుమార్‌గౌడ్, సుధీర్‌కుమార్, ఉపేంద్రాచారి, కిశోర్‌గౌడ్, శుభప్రద పటేల్, దూదిమెట్ల బాలరాజుయాదవ్, ఆలకుంట హరి, గడీల కుమార్‌గౌడ్, మన్నె రాజు పాల్గొన్నారు.