వికారాబాద్, జనవరి 24 : బీసీలు శక్తిగా ఎదగాలని, అందుకు తమవంతు సహకారాన్ని అందిస్తామని శాసన మండలి ప్రతిపక్షనేత సిరికొండ మధుసూదనాచారి తెలిపారు. శనివారం వికారాబాద్ బీసీ సంఘం జేఏసీ ఆధ్వర్యంలో వికారాబాద్‌లోని గౌలికర్ ఫంక్షన్ హాల్లో బీసీ సర్పంచ్‌లను సన్మానించారు. ఈ సందర్భంగా సిరికొండ మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 78 ఏండ్లు అవుతున్నా బీసీలు అన్ని రంగాల్లో ముందుకు వెళ్లలేకపోతున్నారని తెలిపారు. ఎన్నో ఏండ్లుగా బీసీలు అవమానాలు, అసమానతలు, అణచివేతకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. బీసీలకు జరిగింది అవమానం తప్ప మరేమి లేదని ఆవేదన చెందారు.
బీసీల్లో చైతన్యం వస్తే సునాయసంగా అధికారాన్ని చేజిక్కించుకోవచ్చని అన్నారు. బీసీ సర్పంచ్‌లు ఐదేండ్లపాటు గ్రామాల్లో అద్భుత పాలన అందించాలని సూచించారు. శాసనమండలి మాజీ అధ్యక్షుడు స్వామిగౌడ్ మాట్లాడుతూ.. బీసీలు ఏకమై 42 శాతం రిజర్వేషన్ల కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. రాజ్యాధికారం రావాలంటే ఏకతాటిపైకి రావాలని కోరారు.
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ బీసీ సర్పంచ్‌లు మెరుగైన పాలన అందించాలని సూచించారు. బీసీ సర్పంచ్‌లకు ఎలాంటి ఇబ్బందులెదురైనా తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు జ్ఞానేశ్వర్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్ పాల్గొన్నారు.