ఊహించినట్టే జరిగింది. బీసీ సంఘాలు భయపడినట్టే అయ్యింది. 42 శాతం కోటా పేరిట ఊదరగొట్టి.. చివరికి పాత పద్ధతిలో 25 శాతానికి బీసీ కోటాను పరిమితం చేసి ఎన్నికలకు సిద్ధమైంది
రాష్ట్ర ప్రభుత్వం. కానీ క్షేత్రస్థాయిలో పంచాయతీ రిజర్వేషన్ల గందరగోళంతో బీసీలకు ఆ రిజర్వేషన్ కూడా దక్కట్లేదు. అసమగ్ర కులగణన డాటాను ఆధారం చేసుకుని కోటా ఖరారు చేసిన ఫలితమిది!
హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): గ్రామ పంచాయతీ ఎన్నికలకు (Grama Panchayati Elections) సంబంధించి సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాల రిజర్వేషన్ల (Reservations) ఖరారులో పూర్తి గందరగోళం నెలకొన్నది. సర్కారు జారీ చేసిన మార్గదర్శకాలకు విరుద్ధంగా జిల్లాల్లో ఎక్కడికక్కడ అధికారులు ఇష్టారీతిన రిజర్వేషన్లను ఖరారు చేసినట్టు ఆరోపణలొస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీలు ఒక్కరూ లేనిచోట కూడా ఆ వర్గాలకు స్థానాలను రిజర్వ్ చేయడం, పూర్తిగా ఎస్టీలే ఉన్నచోట ఇతర వర్గాలకు రిజర్వ్ చేయడమే అందుకు నిదర్శనం. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి 50 శాతానికి మించకుండా ఎస్టీ, ఎస్సీ, బీసీలకు రిజర్వేషన్లు ఖరారు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జీవో-46ను విడుదల చేసింది. సర్పంచ్ స్థానాలకు ఆర్డీవోలు, వార్డు మెంబర్ల స్థానాలకు ఎంపీడీవోలు రిజర్వేషన్లను ఖరారు చేయాల్సి ఉన్నది. రిజర్వేషన్లను ఏప్రాతిపదికగా నిర్ణయించాలో సర్కారు మార్గదర్శకాల్లో పేర్కొన్నది.
జనాభా దామాషా ప్రకారం తొలుత ఎస్టీ, ఎస్సీ, బీసీ, తదుపరి మహిళా స్థానాలను ఖరారు చేయాల్సి ఉన్నది. ఆయా స్థానాలకు అనుగుణంగా గ్రామం, మండలం, జిల్లా, ఆపై రాష్ట్రం యూనిట్‌గా నిర్దేశిత కోటా ప్రకారం స్థానాలను రిజర్వ్ చేయాల్సి ఉంటుంది. సగం కంటే ఎక్కువ ఏ జనాభా ఉంటే ఆ వర్గానికి మొదటి ప్రాధాన్యంగా స్థానాలను రిజర్వ్ చేస్తూ వెళ్తుంటారు. ఇదీ ఆయా స్థానాల రిజర్వేషన్లకు అనుసరించే ప్రక్రియ. షెడ్యూల్డ్ ఏరియాలోనూ ఎస్టీలకు మొత్తం స్థానాల్లో సగానికి తగ్గకుండా ఉండాలి. 100% ఎస్టీ జనాభా ఉన్నచోట మొత్తంగా వారికే కేటాయించాల్సి ఉంటుంది.
ఇదిలా ఉంటే వార్డు మెంబర్ స్థానాలకు ఇంటింటి సర్వే-2024 లెక్కలను, సర్పంచ్ స్థానాలకు 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకొని ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ఖరారు చేయాలని, ఇంటింటి సర్వే-2024 లెక్కలను పరిగణనలోకి తీసుకుని బీసీలకు రిజర్వేషన్లు ఖరారు చేయాలని ఆదేశించడం చర్చనీయాంశంగా మారింది. దీంతో రిజర్వేషన్ల కేటాయింపు మొత్తంగా గందరగోళంగా మారిందని తెలుస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా నిబంధనలకు విరుద్ధంగా సీట్లను అలాట్ చేశారనే విమర్శలొస్తున్నాయి. అనేకచోట్ల గందరగోళంగా జరిగిందంటూ ఆశావహులు ఇప్పటికే అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ రోడ్డెక్కుతున్నారు.
రిజర్వేషన్లలో బీసీలకు తీరని అన్యాయం జరుగుతున్నదని బీసీ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటికే పలు జిల్లాల్లో సర్పంచ్, వార్డుమెంబర్ స్థానాలకు రిజర్వేషన్లను ఖరారు చేశారు. అయితే చాలా జిల్లాల్లో గతంలో కంటే బీసీ కోటా తగ్గిపోయినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 42% రిజర్వేషన్లు దేవుడెరుగు కనీసం ఇప్పటికే ఉన్న బీసీ రిజర్వేషన్లకే రాష్ట్ర ప్రభుత్వం గండికొడుతున్నదని మండిపడుతున్నారు. వాస్తవంగా 2019లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 18% నుంచి 22.79% వరకు రిజర్వ్ అయ్యాయి.
కానీ, ప్రస్తుతం రాష్ట్రంలో అనేక కొత్త పంచాయతీలు ఏర్పడినప్పటికీ, ప్రస్తుతం బీసీలకు 16 నుంచి 20 శాతానికి మించి రిజర్వేషన్లు దక్కడంలేదని వివరిస్తున్నారు. అనేక డివిజన్లు, మండలాల్లో బీసీలకు ఒకటి కూడా సర్పంచ్ సీటు రిజర్వు కాలేదని, గత ఎన్నికల్లో కంటే కనీసం రెండు మూడు స్థానాల వరకు బీసీ కోటాను తగ్గించారని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అన్ని జిల్లాల్లో బీసీ కోటాను తగ్గించి జనరల్ కోటను పెంచారని బీసీ సంఘాలు చెప్తున్నాయి. రొటేషన్ ముసుగులో బీసీలకు రావాల్సిన సర్పంచ్ స్థానాలను అగ్రకులాలకు కట్టబెడుతున్నారని మండిపడుతున్నాయి.
స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల ఖరారు చేసేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేస్తూ జీవో-46 విడుదల చేసింది. సర్పంచ్ స్థానాలకు 2011 జనాభా లెక్కలను, వార్డు మెంబర్ స్థానాలకు 2024 ఇంటింటి సర్వే (కులగణన) లెక్కలను పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టంచేసింది. అయితే, రాష్ర్టాలు నిర్వహించిన కులగణన సర్వేలకు చట్టబద్ధత లేదని, పారదర్శకత ఉండబోదని, ఆ సర్వే గణాంకాలు చెల్లబోవని కేంద్రం ఇప్పటికే అనేకసార్లు స్పష్టంచేసింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇంటింటి సర్వే గణాంకాలను ప్రామాణికంగా తీసుకోవాలని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. జనాభాగణన అంశం 7వ షెడ్యూల్లో కేంద్ర జాబితాలోని అంశం.
1948 చట్టం ప్రకారం జనాభా గణన చేపట్టే అధికారం కేంద్రానికి మాత్రమే ఉన్నది. ఎలాంటి జనగణన నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాలు లేవు. ఒకవేళ చేసినా ఆ గణాంకాలకు చట్టబద్ధత ఉండకపోవడమేగాక, అమలు చేసే అవకాశం కూడా లేదు. మరోవైపు, కేంద్ర ప్రభుత్వమే గణాంకాల సేకరణ చట్టం-2008 ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు డాటా సేకరణకు కొన్ని పరిమిత అధికారాలను బదలాయించింది. ఒకవేళ రాష్ట్రం నిర్వహించాలని భావించినా అందుకు కేంద్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. అంతేకాదు, సేకరించిన డాటా వెల్లడిపై కూడా అనేక ఆంక్షలను విధించింది. రాష్ట్ర ప్రభుత్వం పేరుకు ఇంటింటి సర్వే అని చెప్పి రాష్ట్రవ్యాప్తంగా జనాభాగణననే నిర్వహించి అందరినీ మభ్యపెట్టింది. గణాంకాల సేకరణ చట్టం-2008 ప్రకారం సర్వే నిర్వహించాలన్నా కొన్ని నిబంధనలను పాటించాల్సి ఉన్నది.
రిజిస్ట్రర్ ఆఫ్ ఎంక్వయిరీస్ చట్టం-1952 ప్రకారం స్వయం ప్రతిపత్తి కలిగిన కమిషన్‌ను ఏర్పాటు చేయడంతోపాటు గణాంకాల సేకరణకు ఒక ప్రభుత్వ శాఖను నోడల్ డిపార్ట్మెంట్గా నియమించాలి. నేషనల్ ప్లానింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్ డిపార్ట్మెంట్, స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్, ఎన్ఎస్ఎస్వో తదితర విభాగాల నుంచి రాష్ర్టానికి చెందిన లేటెస్ట్ ఇండ్ల జాబితాను, బ్లాక్‌వారీగా రూపొందించిన హౌసింగ్ మ్యాపులను కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ప్రజల సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ అవకాశాలకు సంబంధించిన స్థితిగతులను తులనాత్మక అధ్యయనం చేయాల్సి ఉంటుంది. తుదకు అన్నింటినీ క్రోడీకరించి, విశ్లేషించి తుదకు కేంద్రం ఆమోదంతో ఆ గణాంకాలను ప్రామాణికంగా పరిగణనలోకి తీసుకునే అవకాశముంటుంది. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రూ.160 కోట్ల వ్యయంతో రాష్ట్ర ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో 2024 నవంబర్‌లో ఇంటింటి సర్వే నిర్వహించింది.
రాష్ట్రంలో మొత్తంగా 3.7 కోట్ల మంది జనాభా ఉండగా, అందులో 96.9% మందిని సర్వే చేసి వివరాలను సేకరించింది. ఆ లెక్కనే 100% కరెక్టని కాంగ్రెస్ ఢంకా బజాయించింది. అయితే స్థూలంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, మైనారిటీ వర్గాల గణాంకాలనే బయటపెట్టింది. డాటా ప్రైవేసీ యాక్ట్‌ను ఉటంకిస్తూ కులాలు, ఉపకులాల వారీగా వివరాలను మాత్రం గోప్యంగా దాచిపెట్టింది. పూర్తిస్థాయి నివేదికను వెల్లడించకపోవడం, అభ్యంతరాలను స్వీకరించకపోవడంతో సర్వే గణాంకాలకు సాధికారత లేకుండా పోయింది. కానీ, తాజాగా ఆ గణాంకాలనే ప్రామాణికంగా తీసుకుని స్థానిక రిజర్వేషన్లు ఖరారు చేయాలని మార్గదర్శకాలు జారీచేయడంపై చర్చ కొనసాగుతున్నది. కోర్టు చిక్కులు తప్పబోవని భావిస్తున్నారు.
కులగణన అంశం పూర్తిగా కేంద్రం పరిధిలోనిదేనని కేంద్రం గతంలోనే స్పష్టంచేసింది. ప్రధాని మోదీ నేతృత్వంలోని సూపర్ కమిటీగా పేరొందిన రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీపీఏ) సైతం ఇదే విషయం తేల్చిచెప్పింది. దేశవ్యాప్తంగా చేపట్టబోయే జనాభా గణనలో కులగణనను కూడా నిర్వహించాలని ఆ కమిటీ నిర్ణయించింది. అందుకు సంబంధించి షెడ్యూల్‌ను కూడా ఇప్పటికే ప్రకటించింది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 2024 ఇంటింటి సర్వే గణాంకాలను ప్రామాణికంగా తీసుకోవడం ఇప్పుడు అనేక వివాదాలకు తావిస్తున్నది.
ఆయా స్థానాలకు సంబంధించిన రిజర్వేషన్ల రొటేషన్ ప్రక్రియను సైతం నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించారనే ఆరోపణలొస్తున్నాయి. 2019కి ముందు ఏర్పడిన పంచాయతీలు, మండలాలు, జిల్లాలకు మాత్రమే రొటేషన్ వర్తిస్తుంది. 2019 తరువాత ఏర్పడిన నూతన జీపీలు, మండలాలు, జిల్లాలకు రొటేషన్ వర్తించదు. మొదటినుంచి రోస్టర్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. రొటేషన్ ఎలా చేయాలంటే తొలుత ఎస్టీ జనరల్, మహిళలు, ఎస్సీ జనరల్, ఎస్సీ మహిళలు, బీసీ జనరల్, బీసీ మహిళలు, జనరల్ స్థానాలుగా మార్చాలి. ఈ రొటేషన్ క్రమాన్ని కూడా పాటించలేదని తెలుస్తున్నది. అంతేకాకుండా, కొన్ని స్థానాలకు 2011 జనాభాల లెక్కలను, మరికొన్ని స్థానాలకు 2024 ఇంటింటి సర్వే జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకోవడం కూడా గందరగోళానికి దారితీసిందని పలువురు వివరిస్తున్నారు. కొన్ని స్థానాల రిజర్వేషన్‌ను మార్పు చేయకుండా యథాతథంగా కొనసాగించారని అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ రొటేషన్ క్రమం వల్ల ఎక్కువగా బీసీలకు అన్యాయం జరిగిందనే విమర్శలున్నాయి.
రిజర్వేషన్ల కేటాయింపులో గందరగోళం నెలకొన్నది. బీసీ కోటా గతం కంటే తగ్గిపోయింది. అన్ని జిల్లాల వివరాలను సేకరించి త్వరలోనే సీఎస్‌ను కలిసి ఫిర్యాదుచేస్తాం. న్యాయం చేయకుంటే కోర్టుల ద్వారా పోరాటం చేసేందుకైనా సిద్ధంగా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీలోని బీసీ మంత్రులు, ప్రజాప్రతినిధులు ఈ అన్యాయంపై తక్షణం స్పందించాలి. కోటా తగ్గింపునకు వ్యతిరేకంగా మంగళవారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మలను దగ్ధంచేయాలి. 30న చలో హైదరాబాద్ నిర్వహిస్తాం.
-జాజుల శ్రీనివాస్‌గౌడ్