BC Reservations | హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోపే కులగణన చేసి, బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా స్థానిక సంస్థల్లో బీసీలకు ప్రస్తుతం ఉన్న 23% రిజర్వేషన్లను 42శాతానికి పెంచుతామని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. కానీ, 20 నెలలు గడచినా అమలు చేయాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీలో కనిపించడం లేదని బీసీవర్గాలు విమర్శిస్తున్నాయి. కమిషన్ల నియామకం.. ఇంటింటి సర్వే నిర్వహణ.. నివేదికలు.. అసెంబ్లీలో బిల్లుల ఆమోదం వరకూ ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఇందుకు అద్దం పడుతున్నదని ఆరోపిస్తున్నాయి. అంతేకాదు, ఒకసారి కేంద్రం 9వ షెడ్యూల్లో చేర్చాలని, మరోసారి పార్టీపరమైన రిజర్వేషన్లు కల్పిస్తామని, ఇంకోసారి రాజ్యాంగబద్ధంగా కల్పిస్తామని, ప్రస్తుతం ఆర్డినెన్స్ ద్వారా అమలుచేస్తామని.. ఇలా పూటకో మాట చెప్తూ రిజర్వేషన్ల అంశాన్ని గందరగోళం చేస్తున్నదని బీసీ వర్గాలు మండిపడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన విధానాల ఫలితంగా అనేక న్యాయపరమైన సవాళ్లు ఎదరవడమే కాకుండా, తుదకు ఉన్న రిజర్వేషన్లే దక్కకుండా పోయే ప్రమాదం వచ్చిపడిందనే ఆందోళన బీసీవర్గాల్లో వ్యక్తమవుతున్నది. కాంగ్రెస్ విధానరహిత, లోపభూయిష్ట మార్గదర్శకాలతో రిజర్వేషన్ల అంశం పీటముడిగా తయారైంది. కాంగ్రెస్ పాపం బీసీలకు శాపంగా మారింది. ఒక్కోదశలో ఒక్కో అబద్ధపు మెట్టు ఎక్కించి రిజర్వేషన్ పెంపు సౌధాన్ని కాంగ్రెస్ కుప్పకూల్చిందని బీసీవర్గాలు విమర్శిస్తున్నాయి.
మొదటి నుంచీ ప్రధాన శత్రువే..
ఆదినుంచీ బీసీల ప్రధాన శత్రువు కాంగ్రెస్ పార్టీయేనని బీసీ వర్గాలకు చెందిన రాజకీయ, సామాజికవేత్తలు విమర్శిస్తున్నారు. 1955లో కాకా కాలేలర్ కమిటీ బీసీల అభ్యున్నతి కోసం చేసిన సిఫారసులను నెహ్రూ సర్కార్ పక్కనబెట్టిన దగ్గరి నుంచి ఇవ్వాళ తెలంగాణలో రేవంత్ సర్కార్ బీసీ రిజర్వేషన్ల పేరిట చేస్తున్న డ్రామాల దాకా బీసీల సామాజిక, ఆర్థిక, రాజకీయ అభ్యున్నతికి నిలువునా పాతరేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదేనని మండిపడుతున్నారు. జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటుచేసిన మండల్ కమిషన్ నివేదికను ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నకాలంలో సమర్పిస్తే, ఆమె వాటిపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదని గుర్తుచేస్తున్నారు. 2011లో జనాభా లెకలతోపాటు కులగణన కూడా చేయాలని అప్పటి కేంద్ర మంత్రి, ఓబీసీ నేత వీరప్పమొయిలీ.. అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్ మీద ఒత్తిడి తెస్తే అన్యమనస్కంగా దానిమీద చర్చించారే కానీ అడుగు ముందుకుపడలేదని చెప్తున్నారు. అయితే, అప్పుడు మంత్రివర్గం ఆమోదించడంతో విధిలేని పరిస్థితుల్లో 2011-2013 మధ్య కాలంలో ‘సామాజిక ఆర్థిక-కుల సర్వే’ను అంగన్వాడీ టీచర్లు, శిక్షణలేని వలంటీర్లతో చేయించారని వివరిస్తున్నారు.
అన్నీ తెలిసే ఆర్డినెన్స్
ఆర్డినెన్స్ ద్వారా బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు అసంభవమని, రాష్ట్రపతి పరిశీలనలో ఉన్న అంశంపై ఆర్డినెన్స్ చేయడాన్ని ఏ చట్టం సమర్థిస్తుందో చెప్పాలని న్యాయకోవిదులు ప్రశ్నిస్తున్నారు. అసెంబ్లీలో 42% రిజర్వేషన్ బిల్లును ఆమోదించి, రాష్ట్రపతికి పంపించిన తరువాత.. తిరిగి అదే అంశంపై ఆర్డినెన్స్ చేయడంతోనే కాంగ్రెస్‌కు చిత్తశుద్ధిలేదని తేలిపోయిందని అంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో, విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ గత మార్చిలో అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని గవర్నర్‌కు పంపించారు. ప్రస్తుతం బిల్లు రాష్ట్రపతి పరిశీలనలో ఉన్నది. రాష్ట్రపతి పరిశీలనలో ఉన్న బిల్లుపై గవర్నర్ ఆర్డినెన్స్ జారీచేయడం చట్టరీత్యా కుదరదని, ఆర్డినెన్స్‌ను జారీ చేయాలంటే మొదట బిల్లుని ఉపసంహరించుకోవాల్సి ఉంటుందని న్యాయనిపుణులు చెప్తున్నారు. అయితే, అడ్వకేట్ జనరల్ సలహా తీసుకున్నామని, కేవియట్ వేసి ఆర్డినెన్స్‌పై ఎవ్వరూ కోర్టుల్లో అడ్డుకోకుండా చూస్తామంటూ ప్రభుత్వం తొండివాదన చేస్తున్నదని మండిపడుతున్నారు. లైవ్‌లో ఉన్న అసెంబ్లీని ప్రోరోగ్ చేయడం, ఆర్డినెన్స్ తేవడం ఉద్దేశపూర్వకంగా బీసీలను మోసంచేయడమేనని బీసీవర్గాలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి.
బీసీలకు నిండా మోసం
‘నేను కొట్టినట్టు చేస్తా….నువ్వు ఏడ్చినట్టు చేయ్’ అన్నట్టు కాంగ్రెస్, బీజేపీ వ్యవహరిస్తున్నాయని బీసీ వర్గాలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. విద్య, ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లు పెంచాలనే చిత్తశుద్ధి రెండు పార్టీలకు లేదన్న విషయాన్ని జరుగుతున్న పరిణామాలు స్పష్టంచేస్తున్నాయని మండిపడుతున్నారు. తెలంగాణ నుంచి అసెంబ్లీలకు రెండు పార్టీలకు ఎనిమిదేసి మంది ఎంపీలు ఉన్నా ఏం లాభమని ప్రశ్నిస్తున్నాయి. రెండు పార్టీలకూ బీసీల పట్ల చిత్తశుద్ధిలేదని, నిండా మోసం చేస్తున్నాయని బీసీ సామాజిక ఉద్యమకారులు దుయ్యబడుతున్నారు. 42% రిజర్వేషన్లు అమలైతే తమ ఆధిపత్యానికి ఎకడ ఎసరు వస్తుందోననే ఉద్దేశంతో ఆ రెండు పార్టీలు బీసీలను మోసం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
సాధ్యం కాదని తెలిసే మోసం చేసింది
స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు సాధ్యం కాదని తెలిసే కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. ఇందిరా సహాని కేసు మొదలు 2021లో వికాస్ కిషన్‌రావు గావ్లీ వర్సెస్ మహారాష్ట్ర కేసులో ఎట్టి పరిస్థితుల్లో రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ విషయమై సుప్రీంకోర్టు స్పష్టమైన విధివిధానాలను రూపొందించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ల విషయమై ‘ట్రిపుల్ టెస్టు’ సూత్రానికి అనుగుణంగా ఉండాలని ఆదేశించింది. ఈ ట్రిపుల్ టెస్టులో మొదట ఒక డెడికేటెడ్ కమిషన్ ద్వారా రాజకీయ, ఆర్థిక, సామాజిక స్థితిగతులపై గణాంకాలు సేకరించాలి. వాటిని అధ్యయనం చేసి బీసీల రిజర్వేషన్ శాతాన్ని నిర్ణయించాలి. అంతిమంగా ఈ రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదు. అయితే, రేవంత్ సర్కార్ ట్రిపుల్ టెస్ట్లోని డెడికేటెడ్ కమిషన్ గురించి మాట్లాడుతున్నది కానీ, 50% సీలింగ్‌ని విస్మరించిందనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. అంటే 42% రిజర్వేషన్ సాధ్యం కాదని తెలిసే కాంగ్రెస్ మోసం చేసింది. ఈ పరిణామాల పట్ల బీసీ ఆలోచనాపరులు, చైతన్యశీలురు అవగాహనను పెంచుకోవాలె. ఆ మేరకు కార్యశీలతను చాటుకోవాలె.
-సంగిశెట్టి శ్రీనివాస్, ప్రముఖ రచయిత, సామాజిక ఉద్యమకారుడు
మోసాన్ని మోసంతోనే ఎదుర్కొంటాం
అమలు జరగదని తెలిసే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్‌ను ప్రవేశపెట్టి బీసీలను మోసం చేసి గద్దెనెక్కింది. 42% రిజర్వేషన్ అమలు చేయకపోతే అదే కాంగ్రెస్‌ను గద్దె దించే డిక్లరేషన్ అవుతుంది. రేపు జరగబోయేది కూడా అదే.
-జూలూరు గౌరీశంకర్,బీసీ కమిషన్ మాజీ సభ్యుడు
బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన ముఖ్య పరిణామాలు