కరీంనగర్ కార్పొరేషన్, ఫిబ్రవరి 26: ప్రపంచస్థాయి ప్రమాణాలతో మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు చేపడుతున్నామని, ఈ పనులు పూర్తయితే అద్భుతమైన పర్యాటక కేంద్రంగా కరీంనగర్ మారుతుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మానేరు రివర్ ఫ్రంట్‌లో రూ.69 కోట్లతో చేపట్టే బిగ్ ఓ ఐలాండ్ వాటర్ ఫౌంటెయిన్ పనులకు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌తో కలిసి మంత్రి గంగుల ఆదివారం భూమిపూజ చేశారు.
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. కరీంనగర్‌ను ఆనుకొని 24 టీఎంసీల రిజర్వాయర్ ఉన్నదని, పర్యాటకంగా అభివృద్ధి చేయాలనే సీఎం కేసీఆర్ ఆకాంక్ష మేరకు అహ్మదాబాద్‌లోని సబర్మతిని మించి అత్యాధునిక అత్యంత ఆకర్షణీయంగా మానేరు రివర్ ఫ్రంట్ నిర్మాణ పనులు చేపడుతున్నట్టు తెలిపారు. మానేరు పరీవాహక ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో రూ.410 కోట్లను సీఎం కేసీఆర్ మంజూరు చేసినట్టు చెప్పారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ మాట్లాడుతూ.. మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు తెలంగాణలో అందరిని ఆకర్షించే విధంగా మంచి పర్యాటక కేంద్రంగా మారుతుందని అన్నారు.