కరీంనగర్ నెట్వర్క్, డిసెంబర్ 6: బీసీలకు సీఎం రేవంత్రెడ్డి చేసిన మోసంతోనే సాయిఈశ్వరాచారి ఆత్మహత్య చేసుకున్నాడని, ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని బీఆర్ఎస్ నేతలు, బీసీ సంఘం నాయకులు ఆరోపించారు. శనివారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలుచోట్ల ఈశ్వరాచారికి నివాళులర్పించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని కార్గిల్ చౌక్ వద్ద సాయిఈశ్వరాచారి చిత్రపటానికి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల పూలమాలలు వేసి కొవ్వొత్తులతో నివాళులర్పించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఈశ్వరాచారి చిత్రపటం వద్ద బీసీ సాధికారత సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు కొండ దేవయ్య, ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీసీ సాధికారత సంఘం అధ్యక్షుడు పొలాస నరేందర్ నివాళులర్పించారు. కాగా, బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేయడంలో విఫలం చెందిన కేంద్ర, రాష్ట్రంలోని బీసీ మంత్రులు వెంటనే రాజీనామా చేయాలడి డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కనకయ్య గౌడ్, ప్రధాన కార్యదర్శి దొగ్గాలి శ్రీధర్ ఆధ్వర్యంలో నాయకులు ధర్నా చేశారు.