హైదరాబాద్, మే 29 (నమస్తేతెలంగాణ): రైతు డిస్కమ్ పేరిట ఉచిత కరెంట్‌కు కాంగ్రెస్ సర్కార్ ఉరివేసే కుట్రలు చేస్తున్నదని బీఆర్ఎస్ మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జీ జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. అధికాదాయం వచ్చే వినియోగదారులను, సబ్సిడీ పొందే విద్యుత్తు కనెక్షన్లు ఉన్న రైతులను వేరుచేసి భవిష్యత్తులో విద్యుత్తురంగాన్ని ప్రైవేటీకరించే ప్రయత్నం చేస్తున్నదని ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్లో శుక్రవారం నకిరేకల్‌కు చెందిన విద్యార్థి నేత కొమ్మబోయిన సైదులు ఆధ్వర్యంలో పెద్దసంఖ్యలో విద్యార్థి నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి జగదీశ్‌రెడ్డి గులాబీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడారు. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డితో కలిసి ఈఆర్సీ ప్రజా విచారణకు తాను హాజరై అభ్యంతరాలు నమోదు చేసినట్టు జగదీశ్‌రెడ్డి తెలిపారు.
కేసీఆర్ అధికారంలోకి వచ్చాక 2017లో సాగుకు 24 గంటల ఉచిత కరెంట్‌ను ప్రారంభించి నిరంతరాయంగా నాణ్యమైన కరెంట్ సరఫరా చేశామని గుర్తుచేశారు. కానీ, కాంగ్రెస్ పాలనలో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చిందని, హైదరాబాద్‌లో కూడా తరచూ విద్యుత్తు అంతరాయం తలెత్తుతున్నదని విమర్శించారు. థర్డ్ డిస్కమ్ ఏర్పాటుపై సర్కార్ చెప్తున్న కారణాలు సహేతుకంగా లేవని ఆక్షేపించారు. రైతుల పేరిట కరెంట్ చౌర్యం జరుగుతుందని చెప్పడం శోచనీయమని, గతంలో చంద్రబాబు ప్రభుత్వం రైతులపై మోపిన ముద్రను రేవంత్ ప్రభుత్వం పునరావృతం చేస్తున్నదని మండిపడ్డారు.
అశోక్‌నగర్ పేరు వింటేనే రేవంత్‌కు దడ
నిరుద్యోగ యువతకు అబద్ధపు హామీలిచ్చి మోసంచేసిన రేవంత్‌రెడ్డికి అశోక్‌నగర్ పేరు వింటేనే భయపడే పరిస్థితి ఉన్నదని జగదీశ్‌రెడ్డి స్పష్టంచేశారు. ఓట్ల కోసం నాడు యువతకు అలవికాని హామీలిచ్చిన రేవంత్.. అధికారంలోకి వచ్చాక తీరని ద్రోహం చేస్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీని అశోక్‌నగర్ హోటల్ మెట్ల ముందు కూర్చోబెట్టిన ఘనత ఆ యువతకే దక్కిందని పేర్కొన్నారు. అందుకే 144 సెక్షన్ పెట్టారని ఆరోపించారు. సీఎం రేవంత్.. 200 మంది గురుకుల పిల్లలను పొట్టనబెట్టుకున్నారని ఆరోపించారు. అబద్ధాల సీఎం రేవంత్‌ను గద్దెదించి, కేసీఆర్‌ను తిరిగి ముఖ్యమంత్రిగా చేసేందుకు నిర్విరామంగా విద్యార్థులు శ్రమించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే భాస్కర్‌రావు, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు, ఉపాధ్యక్షుడు తుంగ బాలు పాల్గొన్నారు.